2000 Note Exchange RBI Office :రూ. 2వేల నోట్ల ఉపసంహరణపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకు 97 శాతానికి పైగా నోట్లు వెనక్కి వచ్చినట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఇంకా రూ.10,000 కోట్ల నోట్ల మాత్రమే సర్కూలేషన్‌లో ఉన్నాయని ఓ ప్రకటనలో తెలిపింది. 2023 మే 19న రూ. 2వేల నోట్లు రద్దు చేసేనాటికి దేశంలో రూ.3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు సర్క్యూలేషన్లో ఉన్నాయని చెప్పింది. అక్టోబర్ 31 నాటికి అందులో 97 శాతానికి పైగా తిరిగివచ్చినట్లు పేర్కొంది. అయితే, రూ.2000 నోట్ల మార్పిడి/డిపాజిట్ గడువు అక్టోబర్ 7తో ముగిసింది. ఆర్బీఐ మొదటిగా రూ.2000 నోట్ల మార్పిడి/డిపాజిట్‌కు.. సెప్టెంబర్ 30 వరకు గడువు విధించింది. తరువాత ఈ గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించింది.
రూ.2000 నోట్లు చెల్లుతాయి.. కానీ!
2000 Notes Legal Tender : రూ.2,000 నోట్లు అక్టోబరు 7 తర్వాత కూడా చట్టబద్ధంగా (లీగల్ టెండర్) చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ పేర్కొంది. అయితే వాటిని కేవలం ఆర్బీఐ ఇష్యూ ఆఫీస్‌ల్లో మాత్రమే మార్పిడి లేదా డిపాజిట్ చేసుకోవడానికి వీలవుతుందని స్పష్టం చేసింది. ఏ బ్యాంక్ బ్రాంచ్‌లో రూ.2000 నోట్లను డిపాజిట్ చేయడంగానీ, ఎక్స్ఛేంజ్ చేయడం గానీ సాధ్యం కాదని సెంట్రల్ బ్యాంక్ తేల్చి చెప్పింది.