అద్దెపై 18% జీఎస్టీ అందరూ కట్టాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి? - is there any gst on house rent
GST on house rent India : అద్దెపై 18 శాతం జీఎస్‌టీ.. ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త నిబంధన. ఇది అందరికీ వర్తిస్తుందా? నెలనెలా అద్దెతోపాటు జీఎస్టీ భారం కూడా తప్పదా?
GST on rent India : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జూన్‌లో జరిగిన 47వ జీఎస్‌టీ మండలి సమావేశంలో పలు కీలక మార్పులకు ఆమోదముద్ర వేశారు. ఇవి జులై 18న అమల్లోకి వచ్చాయి. అద్దెకుంటున్నవారు అద్దెపై 18 శాతం జీఎస్‌టీ చెల్లించాలన్నది అందులో ఒకటి. ఇప్పటి వరకు నివాస సముదాయాలను ఆఫీసులు, దుకాణాల వంటి వాణిజ్య అవసరాలకు వినియోగించుకుంటేనే జీఎస్టీ చెల్లించాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు మాత్రం ఎలాంటి అవసరానికి అద్దెకు తీసుకున్నా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మరి అద్దెకుంటున్న ప్రతిఒక్కరూ జీఎస్‌టీ చెల్లించాల్సిందేనా? చూద్దాం..
- అద్దెకుంటున్న ప్రతిఒక్కరూ జీఎస్‌టీ చెల్లించాల్సిన అవసరం లేదు.
- కేవలం జీఎస్‌టీలో నమోదు చేసుకున్న అద్దెదారులు మాత్రమే పన్ను చెల్లించాలి. అయితే, చెల్లించిన పన్నుకు జీఎస్‌టీ రిటర్నుల్లో 'ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్' కింద మినహాయింపు కోరవచ్చు.
- వేతన జీవులు అద్దెపై జీఎస్‌టీ చెల్లించాల్సిన అవసరం లేదు.
- జీఎస్‌టీ నమోదిత వ్యక్తుల నుంచి 'రివర్స్ ఛార్జ్ మెకానిజం' ద్వారా పన్ను వసూలు చేస్తారు. అంటే పన్ను చెల్లించాల్సిన బాధ్యత సేవలు పొందుతున్న వ్యక్తిపై ఉంటుంది. అంటే ఇక్కడ ఇళ్లు అద్దెకు ఇస్తున్న యజమానులు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ బాధ్యత అద్దెదారులపైనే ఉంటుంది.
- యజమాని జీఎస్‌టీలో నమోదై ఉండి.. అద్దెదారు కూడా రిజిస్టర్ అయి ఉంటే.. అద్దెకుంటున్నవారు పన్ను చెల్లించాల్సిందే.
- ఒకవేళ యజమాని, అద్దెదారు ఇద్దరూ జీఎస్‌టీలో నమోదుకాకుంటే.. పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
- ఇద్దరికీ జీఎస్‌టీ రిజిస్ట్రేషన్ లేకపోయినా.. పన్ను చెల్లించనక్కర్లేదు.
- స్థూలంగా రూ.20 లక్షలు ఆపైన వార్షిక టర్నోవర్ ఉన్న సర్వీస్ ప్రొవైడర్లు, ఏటా రూ.40 లక్షల టర్నోవర్ ఉన్న వ్యాపారస్థులు.. వారు చెల్లించే అద్దెపై 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.