100 UniCorns In India: బిలియన్ డాలర్లు.. రూపాయల్లో చెప్పాలంటే.. రూ.7,700 కోట్లు. ఈ స్థాయి లేదా అంత కంటే ఎక్కువ నికర విలువ ఉన్న అంకుర సంస్థలను యూనికార్న్‌లుగా పిలుస్తారు. మన దేశంలో కొద్ది సంవత్సరాలుగా అంకురాలకు అన్ని వైపుల నుంచీ మద్దతు లభిస్తుండడంతో.. చాలా వేగంగా విస్తరిస్తున్నాయి. ప్రపంచంలో కొత్తగా 10 యూనికార్న్‌లు ఆవిర్భవిస్తే.. అందులో ఒకటి భారత్‌లో ఉంటోంది. అధిక విలువ వద్ద, మరిన్ని నిధులను సమీకరించడానికీ వాటికి వీలు కలుగుతోంది. దేశీయంగా యూనికార్న్‌ల సంఖ్య 100కు చేరినా, అందులో 23 మాత్రమే లాభాల్లో ఉన్నాయని టాక్షన్ టెక్నాలజీస్ అనే డేటా అనలిటిక్స్ సంస్థ గణాంకాలను బట్టి తెలుస్తోంది.
పెట్టుబడులే.. పెట్టుబడులు..ఈ అంకురాలు ఇప్పటిదాకా 80 బిలియన్ డాలర్ల వరకు నిధులను సమీకరించాయి. వీటి మొత్తం మార్కెట్ విలువ 300 బిలియన్ డాలర్లకు పైగా చేరుకుంది. ఈ 100 యూనికార్న్‌లో కొన్ని స్టాక్ ఎక్స్ఛేంజీల్లో గతేడాది నమోదయ్యాయి. వీటిలోని పేటీఎమ్ మాతృ సంస్థ ఒన్97కమ్యూనికేషన్స్, పాలసీబజార్ మాతృసంస్థ పీబీ ఫిన్‌టెక్, జొమాటో.. వంటి సంస్థల షేర్లు తమ పబ్లిక్ ఇష్యూ ధర కంటే దిగువనే చలిస్తున్నాయి. అధిక నగదు వ్యయ నమూనాల వల్లే ఈ యూనికార్న్‌లు చతికిలబడ్డాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. పేటీఎమ్‌కు లాభదాయకత అనేది కనిపించేలా లేదని మెక్వారీ గ్రూప్ అభిప్రాయపడింది. ‘స్టాక్ మార్కెట్ మదుపర్లు.. దాదాపు ఫిక్స్‌డ్ డిపాజిట్‌దార్లుగానే ఆలోచిస్తారు. 10 శాతం లాభాలు వచ్చినా చాలు అనుకుంటారు. గతేడాది స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదైన యూనికార్న్‌ల షేర్లలో పెట్టిన పెట్టుబడులకూ నష్టం వాటిల్లింది. వీటి వల్ల కొత్త తరం అంకురాల భవిష్యత్ నమోదులపై ప్రభావం పడొచ్చ’ని నిపుణులు పేర్కొన్నారు.
కొత్త కొలమానాలు కావాల్సిందేనా?సంప్రదాయ కంపెనీలతో పోలిస్తే కొత్త తరం సాంకేతిక కంపెనీలకు, చాలా వ్యత్యాసం ఉంటుందని.. వీటిని లాభదాయకత వంటి కీలక ఆర్థిక కొలమానాలతో విలువ కట్టలేమని కొంత మంది అంటున్నారు. 'పీఈ ఎక్కువగా ఉండకపోవచ్చు లేదా ఎబిటా సానుకూలంగా ఉండకపోవచ్చు ఎందుకంటే కొత్త కంపెనీల మూలాలు పూర్తి వైవిధ్యంగా ఉంటాయ’ని అంకుర సంస్థ ప్రమోటరు ఒకరు అంటున్నారు. పీఈ అంటే ప్రైస్ టు ఎర్నింగ్స్. అలాగే వడ్డీ, పన్ను, తరుగుదల, తనఖాకు ముందు లాభాన్ని ఎబిటాగా పిలుస్తారు. అంకురాలు తమ వినియోగదార్లతో వ్యవహరించే విధానం నుంచి కొనుగోలు, అమ్మకాల స్వరూపాన్నే మార్చేశాయి. కొవిడ్ పరిణామాలతో అన్ని రంగాలు డిజిటలీకరణ చెందుతున్నందున, కొత్త కంపెనీల స్వరూపమే మారిపోయింది. వాటి వైవిధ్య మూలాల కారణంగా విలువైనవేనని గుర్తించాలని అంకుర విశ్లేషకులు అంటున్నారు.
లాభాల్లో ఉన్న యూనికార్న్‌లు..గేమ్స్24శ్రీ7, ఆక్సిగో, అమాగి, క్రెడ్‌అవెన్యూ, మమ ఎర్త్, షిప్‌రాకెట్, కాయిన్‌స్విచ్, మైండ్‌టికెల్, ఆఫ్‌బిజినెస్, లెన్స్‌కార్ట్, గప్‌షప్, గ్రో, జెరోధా, పోస్ట్‌మ్యాన్, నైకా, జోహో, బిల్‌డెస్క్, ఫైవ్‌స్టార్‌బిజినెస్ ఫైనాన్స్, ఇన్‌ఫ్రా.మార్కెట్, ఎన్‌ఎక్స్‌ట్రా డేటా, ఫస్ట్‌క్రై, ఫ్రెష్‌వర్క్స్, థాట్‌స్పాట్