అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసేదెవరో, మరో వారం రోజుల్లో తేలిపోతుంది. ఈ ప్రభావంతో కొద్దిరోజులుగా సూచీలు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఫలితంగా మదుపరులు ఎంతో అప్రమత్తతో వ్యవహరిస్తున్నారు. దీర్ఘకాలిక పెట్టుబడులను తగ్గించుకుంటూ స్వల్పకాలిక క్రయవిక్రయాలతో సరిపుచ్చుకుంటున్నారు. మన స్టాక్‌మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి.
ట్రంప్ గెలిస్తే..
గత నాలుగేళ్లలో డోనాల్డ్ ట్రంప్ సారథ్యంలోని రిపబ్లికన్ల ప్రభుత్వం మనదేశానికి ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. కానీ మనదేశంపై సానుకూల వైఖరితో వ్యవహరించింది. అయితే చైనాపై వర్తక యుద్ధం చేయడం వల్ల పరోక్షంగా మనదేశానికి మేలు జరిగింది. దీనికి తోడు కొవిడ్-19 అనంతరం చైనాపై అమెరికా సహా ఎన్నో దేశాలు కస్సుమంటున్నాయి. వాణిజ్యపరంగా చైనాపై ఆధారపడటాన్ని తగ్గించాలనే ఆలోచన ఆయా దేశాల్లో మొదలైంది.
అమెరికా అధ్యక్ష ఎన్నిక.. స్టాక్‌మార్కెట్ ఏమవుతుందో? కరోనా వైరస్‌ను చైనా వైరస్‌గానే పేర్కొంటూ, ట్రంప్ విరుచుకుపడటం చూస్తూనే ఉన్నాం. హువావే వంటి చైనా కంపెనీలపై ట్రంప్ కత్తులు దూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అమెరికా కంపెనీలు మనదేశం వైపు చూసే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా తయారీ రంగంలో అమెరికా, జపాన్, కొన్ని ఐరోపా కంపెనీలు మనదేశంలో ప్లాంట్ల స్థాపనకు ముందుకు వస్తున్నాయి. అధ్యక్షుడిగా మళ్లీ ట్రంప్ గెలిస్తే చైనాతో ప్రస్తుత విధానాలే కొనసాగించే అవకాశం ఉంది కాబట్టి మనదేశం విదేశీ పెట్టుబడులు, కంపెనీలను ఆకర్షించగలుగుతుంది. అది దేశీయ స్టాక్‌మార్కెట్లకు మేలు చేస్తుంది. ట్రంప్ సారథ్యంలో సులువైన పరపతి విధానాన్ని అమెరికా కొనసాగిస్తుంది. దీనివల్ల స్టాక్‌మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులు పెరుగుతాయి. స్వల్పకాలంలో కొన్ని హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ మొత్తం మీద స్టాక్‌మార్కెట్లు స్థిరంగానే ఉంటాయని విశ్వసిస్తున్నారు. ట్రంప్ గెలుపు స్టాక్‌మార్కెట్లకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని అంచనా వేస్తున్నారు.
బైడెన్ గెలిస్తే..
డెమోక్రట్ల అభ్యర్ధి అయిన జో బైడెన్‌కు సోషిలిస్టుగా ముద్ర ఉంది. చైనాతో ఆయన కొంత మెతక వైఖరి అనుసరిస్తారనే అంచనా ఉంది. చైనాతో వర్తక యుద్ధాన్ని ముగిస్తానని ఆయన ఎన్నికల ప్రచారం సందర్భంగా సంకేతాలు ఇచ్చారు. అంతేగాక సులువైన పరపతి విధానాన్ని కొనసాగించకపోవచ్చనే అభిప్రాయం కూడా ఉంది. అంతేగాక బైడెన్ అధ్యక్ష స్థానంలోకి వస్తే... ఆయన ఆ స్థానంలో కుదురుకోడానికి, వివిధ అంశాలపై స్పష్టమైన వైఖరిని నిర్దేశించుకోడానికి కొంత సమయం పడుతుంది. ఈ పరిస్థితుల్లో చైనాకు బదులుగా మనదేశం వైపు చూస్తున్న అమెరికా కంపెనీలు కొంత నెమ్మదించే అవకాశం ఉంది. ఆ మేరకు మనకు నష్టమే.
అమెరికా అధ్యక్ష ఎన్నిక.. స్టాక్‌మార్కెట్ ఏమవుతుందో? మనదేశం విషయంలో బైడెన్ ఎటువంటి వైఖరి అనుసరిస్తారనేది ఇప్పుడే చెప్పలేం. కాకపోతే పూర్తిగా మనదేశాన్ని విస్మరించడం కష్టం. ఇటీవల కాలంలో అమెరికా-భారత్ భాగస్వామ్యానికి కొత్త దారులు తెరుచుకుంటున్నాయి. ముఖ్యంగా రక్షణ, సైన్స్ - టెక్నాలజీ, విద్య రంగాల్లో కలిసి ముందుకు నడిచే అవకాశం కలుగుతోంది. అందువల్ల బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటికీ మనదేశాన్ని పూర్తిగా పక్కనపెట్టే అవకాశం ఉండదు. అయినప్పటికీ కొత్త అధ్యక్షుడి విధానాలు ఎలా ఉంటాయనేది వెంటనే తెలియదు కాబట్టి తాత్కాలికంగా అమెరికా స్టాక్‌మార్కెట్లు బలహీనపడే అవకాశం ఉందని కొన్ని వర్గాల భావన. అదే పరిస్థితి మనదేశంలోనూ స్టాక్‌మార్కెట్లకు వర్తిస్తుందని అంటున్నారు.
ఎవరు గెలిచినా యూఎస్ ఫెడ్ దారి అదే
- అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ గెలిచినా లేదా జో బైడెన్ గెలిచినా అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) విధానాలే కీలకం. అవే అమెరికాతో పాటు ఇతర దేశాల్లో స్టాక్‌మార్కెట్లను ప్రభావితం చేస్తాయి. యూఎస్ ఫెడ్ మాత్రం వచ్చే కొంతకాలం పాటు అధిక నగదు లభ్యత, తక్కువ వడ్డీ రేట్ల విధానానికే కట్టుబడి ఉంటుందనేది అందరిలోనూ వ్యక్తమవుతున్న అభిప్రాయం.
- దాని వల్ల మనదేశంలోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుంది. ఆ సొమ్మే స్టాక్‌మార్కెట్లలోకి, బాండ్లలోకి వస్తుంది.
- ప్రపంచ వ్యాప్తంగా తక్కువ వడ్డీ రేట్లు, అధిక లిక్విడిటీ ప్రభావం ఇప్పటికే మనదేశంలో కనిపిస్తోంది. కొవిడ్-19 వల్ల కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు, కేవలం ఆరు నెలల వ్యవధిలోనే బాగా కోలుకున్నాయి. మళ్లీ రికార్డు స్థాయులకు దగ్గరగా ఉన్నాయి. ఇదంతా విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల ప్రభావమే.
- ఉదాహరణకు ఈ ఏడాది ఆగస్టులో విదేశీ సంస్థాగత మదుపరులు మన స్టాక్‌మార్కెట్లలో గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా 160 కోట్ల డాలర్లు పెట్టుబడిగా పెట్టారు.
- అమెరికా అధ్యక్ష ఎన్నిక పూర్తయితే, పెట్టుబడుల ప్రవాహం ఇంకా పెరుగుతుందని విశ్వసించే వారూ ఉన్నారు. ‘ఎన్నిక హ్యాంగోవర్’ పోతే పెట్టుబడుల ప్రవాహం ఊపందుకుంటుందని, దానివల్ల ఆసియా మార్కెట్లలోకి... మరీ ముఖ్యంగా మనదేశ స్టాక్‌మార్కెట్లకు మేలు జరుగుతుందని మార్కెట్ నిపుణులు కొందరు పేర్కొంటున్నారు.
ఎందుకింత ప్రాధాన్యం?
ప్రపంచ జనాభాలో అమెరికా వాటా 5 శాతమే. కానీ సంపదలో అమెరికా వాటా 20 శాతం. అందుకే అమెరికా ప్రభుత్వం అనుసరించే ఆర్థిక, శాస్త్ర-సాంకేతిక విధానాలు, ఇతర దేశాలను విశేషంగా ప్రభావితం చేస్తాయి. ఆ విధానాలకు ఆమోదముద్ర వేసేది అమెరికా అధ్యక్షుడు కాబట్టి అధ్యక్ష స్థానంలోకి ఎవరు వస్తారనేది ముఖ్యమైన విషయం అవుతుంది. అధ్యక్షుడి విధానాలే స్టాక్‌మార్కెట్లను కూడా కదిలిస్తాయి. అందుకే ఇంత ఆసక్తి.
ఇదీ చూడండి:దేశంలో ఆర్థిక రికవరీకి సంకేతాలు ఇవే!