లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత వాహనాల విక్రయాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో ఆర్టీసీ బస్సులు నడపకపోవటం వల్ల ప్రజలు ఆటోలు, క్యాబ్లపై ప్రయాణించడం కంటే సొంత వాహనాల్లోనే ప్రయాణం చేసేందుకు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా బడ్జెట్ వాహనాల కొనుగోలుపై వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారని విక్రయదారులు పేర్కొంటున్నారు. మార్చి నెలాఖరులో విధించిన లాక్డౌన్తో నిలిచిపోయిన విక్రయాలు, రిజిస్ట్రేషన్లు... మేలో తిరిగి ప్రారంభమయ్యాయి. ఇక కార్ల విషయానికి వస్తే.. 4లక్షల నుంచి 8 లక్షల వరకు గల కార్లను ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నట్లు షోరూం నిర్వహకులు తెలిపారు.
జోరు మీదున్న వాహన విక్రయాలు... సందడిగా మారిన షోరూంలు - corona effect
కరోనా ప్రభావం వల్ల డీలాపడిన వాహన విక్రయాలు... లాక్డౌన్ తర్వాత క్రమంగా పెరుగుతున్నాయి. ప్రజలు సొంత వాహనాల్లో ప్రయాణించేందుకు మొగ్గుచూపుతుండగా... కొత్త వాహనాల కొనుగోళ్లు జోరందుకున్నాయి. ఈ క్రమంలో వాహనాల షోరూంలు కొనుగోలుదారులతో సందడిగా మారిపోయాయి.
ఇక కొత్తవాటితో పాటు సెకండ్ హ్యండ్ కార్లు, ద్విచక్ర వాహనాల విక్రయాలు సైతం భారీగా పెరిగినట్లు షోరూం నిర్వాహకులు పేర్కొంటున్నారు. గతంలో పాత వాహనాలు అమ్మి, కొత్త వాహనాలు కొనుగోలు చేసేవారని... ఇప్పుడు మాత్రం పాత వాహనాలు విక్రయించకుండానే... కొత్త వాహనాలు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ప్రజా రవాణా వాహనాల్లో ప్రయాణిస్తే.. ఎక్కడ వైరస్ సోకుతుందో అనే భయాందోళనలో ప్రజలు ఉన్నారని... అందుకే సొంత వాహనాలు కొనుగోలు చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
వాహనాలను కొనుగోలు చేయడం అత్యవసరం కాకపోయినప్పటికీ... కరోనా వల్ల సురక్షిత ప్రయాణాన్ని ప్రజలు కోరుకుంటున్నట్లు షోరూం యజమానులు చెబుతున్నారు. ఇలాగే కొనసాగితే... వాహనాల విక్రయాలు పూర్వస్థితికి చేరుకుంటాయని అభిప్రాయపడుతున్నారు.