Union Budget 2022: వేతనజీవులకు ఆదాయ పన్ను మినహాయింపులపై మరోసారి నిరాశ తప్పలేదు. వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లు, శ్లాబుల విషయంలో ఈసారి బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలాంటి మార్పు చేయలేదు. కరోనా కారణంగా ద్రవ్యోల్బణం పెరిగిన వేళ స్టాండర్డ్ డిడక్షన్‌ను ప్రస్తుతం ఉన్న రూ.50 వేల నుంచి పెంచుతారని ఆశించినా నిరాశే ఎదురైంది. అయితే.. ఐటీ రిటర్న్‌ల దాఖలులో కాస్త వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఆర్థికమంత్రి తెలిపారు. ఐటీ రిటర్న్‌ల దాఖలులో తప్పిదాలు సరిదిద్దుకుని సవరణలు చేయడానికి రెండేళ్ల కాల సమయం ఇచ్చారు. అంటే రిటర్న్‌లు సమర్పించిన తర్వాత రెండేళ్లలో సవరణలు చేసుకోవచ్చు.
అలాగే కేంద్ర ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌పీఎస్ మినహాయింపునిచ్చారు. వారికి ఎన్‌పీఎస్ మినహాయింపును 10 నుంచి 14 శాతం పెంచుకునే అవకాశం కల్పించారు.
Nirmala sitharaman budget speech
పన్నులకు సంబంధించి బడ్జెట్ ప్రసంగంలో నిర్మల చేసిన ప్రకటనలు
- ఆదాయపన్ను శాఖ తనిఖీలు, జప్తు ఆపరేషన్ల సందర్భంగా గుర్తించిన అప్రకటిత ఆదాయంపై ఎలాంటి నష్టానికి తావులేదు.
- కార్పొరేట్ పన్ను రేటులో ఎలాంటి మార్పు లేదు.
- క్రిప్టో కరెన్సీ లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయంపై 30శాతం పన్ను విధింపు.
- నూతనంగా ఏర్పాటయ్యే తయారీ సంస్థలకు 15 శాతం కార్పొరేట్ పన్ను రాయితీ మరో ఏడాది కొనసాగింపు. మార్చి 2024వరకు ఇది వర్తింపు.
- దీర్ఘకాలిక మూలధన లాభాలపై సర్‌ఛార్జ్ 15 శాతానికి పరిమితం.
- డిజిటల్ కరెన్సీ బదిలీ నిర్దేశిత పరిమితి దాటితే ఒక్క శాతం టీడీఎస్ వసూలు. గిఫ్ట్‌లకు కూడా పన్ను వర్తింపు.
- ఆదాయంపై సెస్ లేదా సర్‌ఛార్జ్‌ను వ్యాపార వ్యయంగా అనుమతించబోమని స్పష్టీకరణ.
- కో-ఆపరేటివ్ సర్‌ఛార్జ్ 12శాతం నుంచి 7 శాతానికి తగ్గింపు.
- కార్పొరేట్‌తో సమానంగా సహకార సంఘాలకు కనీస ప్రత్యామ్నాయ పన్నును 15 శాతానికి తగ్గించాలని ప్రభుత్వ పతిపాదన.