కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఐరోపాకు రాకపోకలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిలిపివేయటం ప్రపంచ మార్కెట్లను కుదిపేసింది. చమురు ధరలు భారీగా పడిపోయాయి. ఈ పరిణామాలు ప్రపంచ ఆర్థిక మాంద్యానికి దారి తీస్తాయన్న భయాలు మదపరుల్లో నెలకొనటం వల్ల అన్ని స్టాక్ ఎక్స్ఛేంజీలు భారీగా నష్టపోయాయి.
కరోనా వైరస్ను అంతర్జాతీయ మహమ్మారిగా డబ్ల్యూహెచ్ఓ ప్రకటించిన తర్వాత ఆసియా మార్కెట్లు భారీగా పడిపోయాయి. ట్రంప్ చేసిన ప్రసంగం అనంతరం మరింత దిగజారాయి.
అన్ని మార్కెట్లూ పాతాళానికే..
జపాన్ మార్కెట్ నిక్కీ 4.4 శాతం నష్టాలతో ముగిసింది. అస్ట్రేలియా మార్కెట్ ఏఎస్ఎక్స్ 200 7.4 శాతం పడిపోయింది. 2008 ఆర్థిక మాంద్యం తర్వాత ఆ స్థాయి నష్టాలను నమోదు చేసింది. హాంకాంగ్ 3.5 శాతం, చైనా షాంఘై కాంపొజిట్ 1.6 శాతం నష్టాల్లో ఉన్నాయి.
దక్షిణ కొరియా, సింగపూర్, ఇండోనేసియా మార్కెట్లు 3 శాతం మేర పడిపోయాయి. బ్యాంకాక్ మార్కెట్ 8 శాతం పతనమైంది.
అమెరికాలోనూ..
అమెరికా వాల్ స్ట్రీట్ మరోసారి భారీ నష్టాలను చవిచూసింది. బోయింగ్ నుంచి లాభాలను ఉపసంహరించుకున్నట్లు హిల్టన్ ప్రకటన మరింత దెబ్బతీసింది. 20 శాతం పతనమై తాజాగా బేర్ గుప్పిట్లోకి వెళ్లిన డౌజోన్స్ మళ్లీ పాతాళానికి చేరింది.
ట్రంప్ ప్రకటన..
ఐరోపాలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోన్న నేపథ్యంలో చాలా రోజుల తర్వాత ప్రజలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు ట్రంప్. బ్రిటన్ మినహా ఐరోపా దేశాలన్నింటికీ 30 రోజుల పాటు ప్రయాణాలను నిలిపేస్తున్నట్లు ప్రకటించారు.
రష్యా, సౌదీ అరేబియా మధ్య చమురు యుద్ధంతో కొద్ది రోజులుగా క్రూడ్ ధరలు భారీగా పతనమయ్యాయి. ట్రంప్ ప్రసంగానికి ముందు కాస్త పుంజుకున్నా... ఐరోపాకు రాకపోకలు నిలిపివేస్తున్నట్లు చేసిన ప్రకటన తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. అంతర్జాతీయ ముడి చమురు ధరలు 6 శాతం పడిపోయాయి.
4,200 మంది మృతి..
చైనా వుహాన్లో మొదలైన కరోనా వైరస్.. ప్రపంచంలోని 107 దేశాలకు విస్తరించింది. వైరస్ కారణంగా ఇప్పటికీ వరకు ప్రపంచవ్యాప్తంగా 4,200 మంది చనిపోయారు. మరో 1,17,330 మంది వైరస్ బారిన పడ్డారు. చైనా తర్వాత ఇటలీలో అత్యంత వేగంగా వ్యాపిస్తోంది వైరస్. ఈ దేశంలో ఇప్పటివరకు 631 మంది మృతిచెందారు.
ఇదీ చూడండి:ఢమాల్ స్ట్రీట్: రూ.11 లక్షల కోట్ల సంపద ఆవిరి