Stocks Close:వారాంతపు సెషన్లోనూ దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. తీవ్ర ఒడుదొడుకుల అనంతరం.. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 59 పాయింట్లు కోల్పోయింది. 57 వేల 833 వద్ద సెషన్‌ను ముగించింది.
సెన్సెక్స్ తొలుత 400 పాయింట్లకుపైగా నష్టంతో 57 వేల 488 వద్ద ప్రారంభమైంది. ఇదే సెషన్ కనిష్ఠం. అనంతరం పుంజుకొని లాభాల్లోకి మళ్లింది. 250 పాయింట్లకుపైగా పెరిగి 58 వేల 175 వద్ద గరిష్ఠం నమోదుచేసింది. గత సెషన్ల మాదిరిగానే ఆఖరి గంటలో మళ్లీ భారీ కుదుపునకు లోనైంది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 28 పాయింట్ల నష్టంతో 17 వేల 276 వద్ద స్థిరపడింది.
రష్యా- ఉక్రెయిన్ ఉద్రిక్త పరిస్థితులు.. వరుసగా మూడో సెషన్లో మార్కెట్లలో నష్టానికి కారణమయ్యాయి.
శుక్రవారం సెషన్లో బ్యాంకింగ్ రంగం షేర్లు మాత్రం స్వల్పంగా లాభపడ్డాయి. ఫార్మా, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు పతనమయ్యాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా నష్టాల్లోనే ముగిశాయి.