Stock Market Close: రష్యా ఉక్రెయిన్ మధ్య చర్చల నేపథ్యంలో దేశీయ మార్కెట్లు పుంజుకున్నాయి. వారం తొలి సెషన్లో మార్కెట్లు లోభాల్లో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 389పాయింట్లు పెరిగి 56,247 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 135 పాయింట్ల లాభంతో 16,794 వద్ద సెషన్‌ను ముగించింది.
విద్యుత్, లోహ, ఆయిల్ గ్యాస్ షేర్లు దన్నుతో సూచీలు చివరిలో పుంజుకున్నాయి.
ఇంట్రాడే సాగిందిలా..
రష్యా, ఉక్రెయిన్ యుద్ధ భయాలతో సెన్సెక్స్ ఉదయం 732 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. అయితే ఆ దేశాల మధ్య చర్చలతో అనుహ్యంగా పుంజుకుంది. ఇంట్రాడేలో 54,833 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. 56,324 వద్ద గరిష్ఠానికి చేరింది. 1,491 పాయింట్ల మధ్య కదలాడింది.
మరో సూచీ నిఫ్టీ 16,356 వద్ద కనిష్ఠం, 16,815 వద్ద గరిష్ఠానికి చేరింది.
లాభనష్టాల్లోని ఇవే..
టాటాస్టీల్, పవర్‌గ్రిడ్, రిలయన్స్, టైటాన్, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ, ఏషియన్పెయింట్, ఐసీఐసీఐ బ్యాంకు, సన్‌ఫార్మా, బజాజ్ ట్విన్స్, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లు ప్రధానంగా లాభాపడ్డాయి.
డాక్టర్రెడ్డీస్, ఎం అండ్ ఎం, యాక్సిస్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, కొటక్బ్యాంకు, ఇండస్ఇండ్బ్యాంకు షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.
పుంజుకోవడానికి కారణాలివే..
ఉక్రెయిన్‌లో రష్యా దాడులు వరుసగా ఐదోరోజు కొనసాగుతున్నప్పటికీ దేశీయ సూచీలు సోమవారం సానుకూలంగా ముగిశాయి.
- శాంతి చర్చలకు ఇరు దేశాలు అంగీకారం తెలపడం.. ఉక్రెయిన్‌లో రష్యా దాడుల తీవ్రత తగ్గిందన్న వార్తలు సూచీలకు కలిసొచ్చాయి. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు.
- కుప్పకూలుతున్న రష్యా కరెన్సీ రూబుల్‌కు దన్నుగా నిలిచేందుకు ఆ దేశం కీలక చర్యలు చేపట్టింది. బ్యాంకు వడ్డీ రేటు పెంచడం సహా బ్యాంకులపై ఆంక్షలను సడలించింది. ఇది కూడా సూచీలపై సానుకూల ప్రభావం చూపింది.
- చమురు, గ్యాస్ ధరలు భారీగా పెరగగా.. ఆయా రంగాలకు చెందిన స్టాక్‌లు లాభపడ్డాయి.
- ఐరోపా మార్కెట్లు, ఆసియా మార్కెట్లు, అమెరికా ఫ్యూచర్స్ అన్నీ నష్టాల్లోనే ఉన్నప్పటికీ.. దేశీయ మార్కెట్లు మాత్రం అందుకు భిన్నంగా రాణించాయి.
ఇదీ చూడండి:'ఆఫీస్‌లకు తర్వాత.. ముందు సిటీకి రండి'