దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 646 పాయింట్లు బలపడి 38,840 వద్ద స్థిరపడింది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ-నిఫ్టీ 171 పాయింట్ల లాభంతో 11,449 వద్దకు చేరింది.
హెవీ వెయిట్ షేర్ల దూకుడు..
రిలయన్స్, యాక్సిస్, బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ వంటి హెవీవెయిట్ షేర్ల దన్ను, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు లాభాలకు ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
బీఎస్ఈలో దాదాపు 100 దిగ్గజ సంస్థ షేర్ల విలువ 52 వారాల గరిష్ఠాన్ని తాకాయి. రిలయన్స్ షేర్లు సుమారు 7 శాతం లాభపడ్డాయి.
తొలి కంపెనీగా రిలయన్స్..
రిలయన్స్ మార్కెట్ విలువ భారీగా పెరిగింది. దేశంలో 200 బిలియన్ డాలర్లకు చేరిన తొలి సంస్థగా అవతరించింది. రిటైల్ వ్యాపారంలో ప్రముఖ ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్ పెట్టుబడుల నేపథ్యంలో రిలయన్స్ షేర్లపై మదుపరులు ఆసక్తి చూపారు. ఫలితంగా రిలయన్స్ షేరు విలువ జీవిత కాల గరిష్ఠాన్ని చేరుకుంది.