దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలకు తోడు మదుపర్ల లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం వల్ల సూచీలు కుదేలయ్యాయి. సెన్సెక్స్ ఏకంగా 1159 పాయింట్లకుపైగా కోల్పోయి 59 వేల 985 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 354 పాయింట్లు నష్టపోయి.. 17,857 వద్దకు చేరింది.
బ్యాంకింగ్, లోహ, విద్యుత్తు, రియల్టీ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడితో భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఇంట్రాడే సాగిందిలా..
ఉదయం 61,081 వద్ద ఫ్లాటుగా ప్రారంభమైన సెన్సెక్స్ క్రమంగా నష్టాల్లోకి జారుకుంది. ఒకదశలో కనిష్ఠంగా 59,777 పాయింట్ల వద్దకు దిగజారింది.
నిఫ్టీ 18,187 వద్ద ప్రారంభమై.. గరిష్ఠంగా 18,190 పాయింట్లకు చేరింది.
లాభనష్టాలోని ఇవే..
ఇండస్బ్యాంక్ 2.63శాతం, ఎల్ అండ్ టీ 1.92శాతం, ఆల్ట్రాటెక్సిమెంట్ 1.11 శాతం, ఏషియన్ పెయింట్ 1.04 శాతం, మారుతి 0.31శాతం షేర్లు ప్రధానంగా లాభాలు గడించాయి.
ఐటీసీ 5.58 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 4.10 శాతం, కొటక్ బ్యాంకు 3.91 శాతం, యాక్సిస్ బ్యాంకు 3.59 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ, 3.05 శాతం, ఎస్బీఐఎన్ 2.91 శాతం, టైటాన్ 2.78 శాతం, ఎన్టీపీసీ 2.58 శాతం ఎక్కువగా నష్టపోయాయి.
మార్కెట్ పతనానికి కారణాలివే..
- ఇటీవల పలు కంపెనీలు త్రైమాసిక ఫలితాలను ప్రకటించాయి. అయితే అందులో చాలా కంపెనీలు దలాల్ స్ట్రీట్ అంచనాలను అందుకోలేకపోయాయి. ఇది మదుపర్లపై ప్రతికూల ప్రభావం చూపింది. ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, అదానీపోర్ట్స్ వంటి దిగ్గజ షేర్లలో లాభాల స్వీకరణ మార్కెట్లను దెబ్బతీసింది.
- గడిచిన రెండు వారాల్లో దేశీయ మార్కెట్లు రికార్డు లాభాలతో పరుగులు తీశాయి. దీంతో ఈ వారం ఆరంభం నుంచే విదేశీ సంస్థాగత మదుపర్లు లాభాల స్వీకరణ ప్రారంభించారు. అదే విధంగా దేశీయ మదుపర్లు కూడా అమ్మకాలకు మొగ్గుచూపారు.
- నేటితో అక్టోబరు డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగుస్తుంది. అందువల్ల ఈ రోజు సెటిల్‌మెంట్ వాల్యూ కోసం అమ్మకాలు ఎక్కువగా జరిగాయి.
- బ్యాంకింగ్ రంగ షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలతో నిఫ్టీ బ్యాంక్ సూచీ 40000మార్క్ దిగువకు పడిపోయింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి దిగ్గజ షేర్లు భారీగా పతనమయ్యాయి.
- వీటికి తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. అమెరికా మార్కెట్లు నిన్న మిశ్రమంగా ముగిశాయి. డోజోన్స్ రికార్డుల నుంచి వెనక్కి వచ్చి 250 పాయింట్లు కోల్పోయింది. నాస్‌డాక్ మాత్రం లాభాల్లో ముగిసింది. ఈ ప్రభావం ఆసియా మార్కెట్లపైనా పడింది.
ఇదీ చూడండి:భారతీ ఎయిర్టెల్కు సుప్రీంకోర్టు షాక్!