కరోనా వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు ఎన్నడూ లేని విధంగా పడిపోయాయి. కొద్ది నెలల వ్యవధిలో క్రమంగా పుంజుకొని ఆంగ్ల అక్షరం 'వీ' ఆకారంలో రికవరీ అయ్యాయి. లాక్డౌన్ ప్రారంభంలో వచ్చిన నష్టాలను అధిగమిస్తూ కరోనా విపత్తు ముందు స్థాయికి సూచీలు చేరుకున్నాయి.
కరోనా ప్రారంభ నష్టాల నుంచి రికవరీ అయినప్పటికీ మార్కెట్లు స్వల్ప, మధ్యస్థ కాలానికి ఇంకా హెచ్చుతగ్గుల్లోనే ఉండనున్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.
వచ్చే నెలల్లో నిఫ్టీ, సెన్సెక్స్ గమనాన్ని ప్రభావితం చేసే ఐదు అంశాలను చూద్దాం.
1. అమెరికా ఎన్నికలు
మరికొన్ని రోజుల్లో అమెరికా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అంతర్జాతీయ మదుపర్లు వేచి చూసే ధోరణిలో పడ్డారు. అయితే ఎన్నికల అనంతరం కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముంది.
"డొనాల్డ్ ట్రంప్ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియపై అనుమానాలను వ్యక్తపరిచారు. ఆయన ఓడిపోతే ఎన్నికల ఫలితాలను వ్యతిరేకించే అవకాశం ఎక్కువగా ఉంది. ఎన్నికలు అయిన తర్వాత చాలా రోజుల వరకు ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం లేదు."
- సాక్షి గుప్తా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ట్రెజరీ ఎకనామిక్ రీసెర్చ్
ఇటీవల విడుదల చేసిన మార్కెట్ అవుట్‌లుక్ నివేదికలోనూ ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేసింది సామ్ కో సెక్యూరిటీస్.
"అమెరికా ఎన్నికల వ్యవస్థపై వివాదం ఎక్కువ కాలం కొనసాగితే రెండో దశ ఉపశమన ప్యాకేజీ ఇంకా ఆలస్యం అవుతుంది. దీనివల్ల మరోసారి మార్కెట్లో ఉండాల్సిన లిక్విడిటీ తగ్గిపోవటం వల్ల అంతర్జాతీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడుతుంది. భారతదేశంలో దేశీయ మార్కెట్లలో స్వల్ప కాలంలో లాభాల స్వీకరణ జరిగి, సూచీలు సమాంతరంగా కదలవచ్చు. దీనివల్ల ఈ సంవత్సరం చివరిలోపు సూచీలు కొత్త గరిష్ఠాలను తాకే అవకాశాలు తక్కువ. దీనికి బదులు ఎక్కువ స్థాయిలో లాభాల స్వీకరణ దిగే అవకాశం ఉంది" అని నివేదిక పేర్కొంది.
2. కరోనా కేసుల పెరుగుదల
ఐరోపాలో కేసుల పెరుగుదల, దానివల్ల ఆర్థిక వృద్ధి నెమ్మదిస్తుందన్న భయాలతో గత నెల నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు జాగ్రత్త వహిస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలలో ఆంక్షలు.. దేశీయ మార్కెట్లకు ప్రధాన అవరోధంగా పరిగణిస్తారు. దీనివల్ల వినియోగదారుల పరిమిత వ్యయం, ఉద్యోగ నష్టాల భయాలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఈ పరిణామం ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడదు.