అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు, కీలక సంస్థల త్రైమాసిక ఫలితాల జోరుతో దేశీయ స్టాక్ మార్కెట్(stock market today) సూచీలు సోమవారం జీవితకాల గరిష్ఠాలను తాకాయి. గతవారం విడుదలైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, డి-మార్ట్, అల్ట్రాటెక్ సిమెంట్ త్రైమాసిక ఫలితాలు మెప్పించటం వల్ల పెట్టుబడులకు మదుపరులు మొగ్గుచూపారు.
ఇంట్రాడే సాగిందిలా..
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్(Bse sensex) సోమవారం ఉదయం 61,817 వద్ద ప్రారంభమైంది. ఒకానొక దశలో భారీగా పుంజుకుని 61,963 పాయింట్ల జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత లాభాల స్వీకరణకు మదుపరులు మొగ్గు చూపటం వల్ల 460 పాయింట్ల లాభంతో 61,765 వద్ద ముగిసింది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ(nifty today) సోమవారం ఉదయం 18,500 వద్ద ప్రారంభం కాగా.. ఒక దశలో 18,445 పాయింట్ల దిగువకు చేరుకుంది. మదుపరులు పెట్టుబడులకు మొగ్గు చూపగా.. భారీగా పుంజుకుని 18,543 పాయింట్ల జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 138 పాయింట్ల లాభంతో 18,477 వద్ద స్థిరపడింది.