Stock Markets Close: మంగళవారం సెషన్లో పుంజుకున్న స్టాక్ మార్కెట్లు మరుసటి రోజు మళ్లీ పడిపోయాయి. ఆరంభంలో సానుకూలంగా కదలాడిన సూచీలు.. కాసేపటికే తీవ్ర ఒడుదొడుకులతో నష్టాల్లోకి జారుకున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 304 పాయింట్లు కోల్పోయి 57 వేల 685 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 70 పాయింట్ల నష్టంతో 17 వేల 246 వద్ద సెషన్‌ను ముగించింది. తొలుత లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఓ దశలో 420 పాయింట్లకుపైగా పెరిగి 58 వేల 417 వద్ద సెషన్ గరిష్ఠాన్ని నమోదు చేసింది. మళ్లీ 420 పాయింట్ల నష్టంతో.. 57 వేల 569 వద్ద కనిష్ఠాన్ని తాకింది.
లాభనష్టాల్లో ఇవే:ఫార్మా, విద్యుత్ రంగం షేర్లు ఒక శాతం మేర రాణించాయి. ఆటో, బ్యాంకింగ్, లోహ రంగం సూచీలు నష్టాల్లో ముగిశాయి. వీటిల్లో ఎక్కువగా అమ్మకాలు కనిపించాయి. హిందాల్కో, దివీస్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా స్టీల్, యూపీఎల్ లాభపడ్డాయి. కోటక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ, బ్రిటానియా, భారతీ ఎయిర్టెల్, సిప్లా డీలాపడ్డాయి. సెన్సెక్స్ 30 ప్యాక్‌లో సగం కంటే ఎక్కువ షేర్లు పతనమయ్యాయి. మొత్తంగా 1424 షేర్లు ముందుకు దూసుకెళ్లాయి. 1891 షేర్లు పడిపోయాయి. 118 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా రెండో సెషన్లోనూ ఫ్లాట్‌గా ట్రేడయ్యాయి.