తెలంగాణ

telangana

ETV Bharat / business

టెక్​ దిగ్గజాల ఫలితాలపై మదుపర్ల దృష్టి

ఈ వారం ఫలితాలను వెల్లడించనున్న విప్రో, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ లపై మదుపర్లు దృష్టి సారించొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందన్న ఆర్​బీఐ సంకేతాలతో సూచీలు సానుకూలంగా ప్రారంభం కావొచ్చని చెబుతున్నారు. మరోవైపు లాభాల స్వీకరణకూ అవకాశం లేకపోలేదని తెలిపారు.

stock market outlook
టెక్​ దిగ్గజాల ఫలితాలపై మదుపర్ల దృష్టి

By

Published : Oct 12, 2020, 6:23 AM IST

ఆర్థిక వ్యవస్థలో గిరాకీ పుంజుకుంటుందని ఆర్‌బీఐ వ్యాఖ్యానించిన నేపథ్యంలో దేశీయ సూచీలు సానుకూలంగా ప్రారంభం కావొచ్చు. మరో వైపు అమెరికా ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించొచ్చన్న అంచనాలు కూడా ఇందుకు సహకరించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ వారం నిఫ్టీ తన కీలక 12,000 స్థాయిని అధిగమించొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే అంతర్జాతీయ మార్కెట్లు, కార్పొరేట్‌ ఫలితాలను బట్టి ఆ లాభాలు కొనసాగుతాయా లేదా అన్నది ఆధారపడి ఉంటుంది. ఈ వారం ఫలితాలను వెల్లడించనున్న విప్రో (నేడు), ఇన్ఫోసిస్‌ (14న), హెచ్‌సీఎల్‌ టెక్‌ (16న) లపై మదుపర్లు దృష్టి సారించొచ్చు. ఆగస్టు ఐఐపీ, సెప్టెంబరు ద్రవ్యోల్బణ గణాంకాలు, రుణ మారటోరియం గడువులో విధించిన వడ్డీ మాఫీపై సుప్రీం కోర్టు విచారణ తదితరాల ప్రభావం కూడా కనిపించవచ్చు. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

  • యంత్రపరికరాల షేర్లు ఈ వారం రాణించవచ్చు. ఆగస్టులో పారిశ్రామికోత్పత్తిలో క్షీణత 7 శాతానికి పరిమితం కావొచ్చన్న అంచనాలున్నాయి.
  • రాబోయే పండుగల సీజనులో రిటైల్‌ విక్రయాలు రాణించవచ్చన్న అంచనాల మధ్య వాహన రంగ కంపెనీల షేర్లు లాభాలందుకోవచ్చు. ఈ వారం సియామ్‌ విడుదల చేసే టోకు గణాంకాలనూ మదుపర్లు గమనించవచ్చు.
  • ఆర్‌బీఐ ప్రకటించిన ద్రవ్య లభ్యత, రుణ వృద్ధి చర్యల కారణంగా నిఫ్టీ బ్యాంక్‌ సూచీ లాభాలను కొనసాగించవచ్చు. కర్ణాటక బ్యాంక్‌(13న), ఫెడరల్‌ బ్యాంక్‌(16న) ఫలితాల నేపథ్యంలో ఎంపిక చేసిన స్క్రిప్‌లలో కదలికలు కనిపించవచ్చు. మారటోరియం వడ్డీ మాఫీపై సుప్రీం కోర్టు చేపట్టే విచారణ కూడా ప్రభావం చూపొచ్చు.
  • లాక్‌డౌన్‌ షరతులను మరింత సడలించిన నేపథ్యంలో గిరాకీ పుంజుకుంటుందన్న అంచనాల మధ్య ఎఫ్‌ఎమ్‌సీజీ స్క్రిప్‌లు రాణించవచ్చు.
  • లోహ, గనుల కంపెనీల షేర్లు సానుకూలంగా ఉండొచ్చు. ఫలితాలపై బలమైన అంచనాలకు తోడు తక్కువ స్థాయిల్లో కొంత కొనుగోళ్లు ఇందుకు దోహదం చేయవచ్చు.
  • సిమెంటు కంపెనీల షేర్లు పెరగవచ్చు. వర్షాల సీజను ముగింపు నేపథ్యంలో గిరాకీ పెరగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. సిమెంటు ధరలు కూడా అక్టోబరు నుంచి ప్రియం కావొచ్చు.
  • పోస్ట్‌పెయిడ్‌ వినియోగదార్ల కోసం రిలయన్స్‌ జియో కొత్త ఫీచరును తీసుకురావడం వల్ల ఈ రంగంలో తాజా పోటీకి దారితీయవచ్చు. ఈ నేపథ్యంలో టెలికాం షేర్లు ఊగిసలాటకు గురికావొచ్చు. భారతీ ఎయిర్‌టెల్‌ సానుకూలంగా చలించవచ్చు.
  • ఐటీ కంపెనీల షేర్లు మూడో వారమూ లాభాల్లో కొనసాగొచ్చు. పలు కంపెనీలు తమ విక్రయ వృద్ధి అంచనాలను పెంచే అవకాశం ఉండడం ఇందుకు నేపథ్యంగా చెప్పవచ్చు. ఈ వారం వెలువడనున్న విప్రో, ఇన్ఫీ, మైండ్‌ ట్రీ, హెచ్‌సీఎల్‌ టెక్‌ ఫలితాలు; విప్రో బైబ్యాక్‌లను మదుపర్లు గమనించవచ్చు.
  • సెప్టెంబరు త్రైమాసిక ఫలితాల్లో ఫార్మా కంపెనీలు రాణించడానికి అవకాశం ఉన్నందున ఈ రంగ షేర్లు లాభాలను కొనసాగించవచ్చు.

ABOUT THE AUTHOR

...view details