దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో (Stock market today) మరో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. శుక్రవారం.. సెన్సెక్స్(BSE sensex) ఆరంభంలోనే 60 వేల పాయింట్ల మైలురాయిని అధిగమించింది. నిఫ్టీ కూడా 18000 కీలక మైలురాయి దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. అమెరికా మార్కెట్లు(US Stock market news) కూడా చివరి సెషన్లో భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి. దేశీయంగా పలు సానుకూల పరిణామాలు కూడా బుల్ రంకెకు కారణమవుతున్నాయి.
సెన్సెక్స్.. 60 వేల ప్రస్థానం
దలాల్ స్ట్రీట్ కొనుగోళ్లతో స్టాక్‌మార్కెట్(Stock market news) కళకళలాడుతోంది. ఫలితంగా.. సెన్సెక్స్ కొత్త రికార్డుల్లో దూసుకెళ్తోంది. సెన్సెక్స్ 60 వేల మార్కును చేరిందిలా..
1990లో తొలిసారి 1000 మార్క్‌ను దాటి..
దాదాపు 30 ఏళ్ల క్రితం 1990లో తొలిసారిగా 1000 మార్క్‌ను దాటిన సెన్సెక్స్.. అంచెలంచెలుగా 60 వేల మార్క్‌కు చేరింది. అయితే ఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసింది. హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్, సత్యం లాంటి కుంభకోణాలు.. జీఎస్‌టీ అమలు, నోట్ల రద్దు లాంటి ప్రభుత్వ నిర్ణయాలు, కరోనా మహమ్మారి.. ఇలా ఎన్నో ఘటనలు మార్కెట్‌పై(Stock market live updates) తీవ్ర ప్రభావం చూపాయి. అదే సమయంలో మోదీ ప్రభుత్వ సంస్కరణలు, కొవిడ్ టీకాలకు ఆమోదం వంటి పరిణామాలు సూచీలను నిలబెట్టాయి. అలా నేడు సెన్సెక్స్ 60 వేలకు చేరింది. ఈ సందర్భంగా సూచీ ప్రస్థానాన్ని ఓసారి క్షుణ్ణంగా చూస్తే..
- 1990 జులై 25న సానుకూల వర్షపాతం, కార్పొరేట్ ఫలితాలతో సెన్సెక్స్ తొలిసారిగా 1000 మార్క్‌ను దాటింది.
- అయితే సెన్సెక్స్ 10వేల మార్క్‌ను చేరడగానికి దాదాపు 16ఏళ్లు పట్టింది. 2006 ఫిబ్రవరి 7న 10,000 మైలురాయిని దాటింది.
- ఆ తర్వాతి సంవత్సరమే అంటే 2007 డిసెంబరు 11న సూచీ 20,000 మార్క్‌ను చేరుకుంది.
- మళ్లీ ఎనిమిదేళ్లకు 2015 మార్చి 4న రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్లను తగ్గించడంతో 30వేల మైలురాయిని దాటింది.
- ఆ తర్వాత నుంచి సెన్సెక్స్ వేగం పుంజుకుంది. 2019 మే 23న సార్వత్రిక ఎన్నికల ఫలితాల సమయంలో తొలిసారిగా 40వేల మార్క్‌ను చేరింది.
9 నెలల్లో 93శాతం పెరిగి..
గతేడాది మార్చిలో దేశంలో కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో సెన్సెక్స్ (Stock market today) కూడా తీవ్ర ఒడుదొడుకులకు లోనైంది. ఒకదశలో గతేడాది మార్చి నెలలో 25,638.90కి పడిపోయింది. ఆ తర్వాత క్రమక్రమంగా పెరుగుతూ వచ్చిన సూచీ.. రికార్డు స్థాయిలో దూసుకెళ్తోంది. కేవలం 9 నెలల్లోనే సూచీ 93 శాతం పెరిగి.. 2021 జనవరి 21న సెన్సెక్స్ 50వేల మైలురాయిని అధిగమించింది.