Stock Market News: భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం మరోసారి కుప్పకూలాయి. నాలుగు సెషన్ల నష్టాల అనంతరం గురువారం స్వల్ప లాభాలొచ్చినా.. వారాంతంలో దేశీయ సూచీలు మళ్లీ పతనమయ్యాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ దాదాపు 900 పాయింట్లు కోల్పోయింది. చివరకు 57 వేల 12 వద్ద స్థిరపడింది.
ఆరంభంలో స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేదు. సెన్సెక్స్ ఓ దశలో 950 పాయింట్లకుపైగా పతనమై.. 56 వేల 951 వద్ద సెషన్ కనిష్ఠానికి చేరింది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 17 వేల మార్కు దిగువకు చేరింది. 263 పాయింట్లు తగ్గి 16 వేల 985 వద్ద సెషన్‌ను ముగించింది.
US Fed Meeting Outcome: అమెరికా ఫెడ్ వచ్చే ఏడాది వడ్డీరేట్లను పెంచుతామని ప్రకటించడం, బాండ్ల విక్రయాల ద్వారా 30 బిలియన్ డాలర్లు సేకరిస్తామని చెప్పడంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1800 డాలర్లు దాటింది. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరగడం కూడా మదుపర్లను కలవరపెడుతోంది.
దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత మదుపర్లు.. భారీగా పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. ఈ పరిణామాలతోనే దేశీయ సూచీలు నేటి సెషన్లో భారీ నష్టాలను చవిచూశాయి.