Stock Market New IPOs: స్టాక్ మార్కెట్లలో ప్రతికూల పరిస్థితుల కారణంగా వరుస ఐపీఓలకు బ్రేక్ పడింది. అనేక కంపెనీలు ఇప్పటికే పబ్లిక్ ఇష్యూలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమలో మదుపర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే కొన్ని ఐపీఓలు ఏంటో చూడండి..
రూ.7,460 కోట్ల డెలివరీ ఐపీఓ
సరఫరా చైన్ కంపెనీ డెలివరీ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.7,460 కోట్ల నిధుల్ని సమీకరించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతి ఇచ్చింది. ఈ ఐపీఓలో రూ.5,000 కోట్ల విలువైన తాజా షేర్లను కంపెనీ విక్రయించనుంది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) ద్వారా రూ.2,460 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత వాటాదార్లు విక్రయించనున్నట్లు ముసాయిదా పత్రాల్లో కంపెనీ పేర్కొంది. ఓఎఫ్‌ఎస్‌లో కార్లైల్ గ్రూప్, సాఫ్ట్ బ్యాంక్, డెలివరీ సహ వ్యవస్థాపకులు కపిల్ భారతి, మోహిత్ టాండన్, సూరజ్ సహరన్ తమ వాటాలను విక్రయించనున్నారు. ప్రస్తుతం కంపెనీలో సాఫ్ట్ బ్యాంక్‌కు 22.78 శాతం, కార్లైల్‌కు 7.42 శాతం, చైనా మూమెంటమ్ ఫండ్‌కు 1.11 శాతం, కపిల్ భారతికి 1.11 శాతం, టాండన్‌కు 1.88 శాతం, సూరజ్‌కు 1.79 శాతం వాటాలున్నాయి. ఈ ఇష్యూకు కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ ఇండియా, మోర్గాన్ స్టాన్లీ ఇండియా కంపెనీ, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి.
ఏపీఐ హోల్డింగ్స్ @రూ.6,250 కోట్లు
ప్రముఖ ఆన్‌లైన్ ఔషధ డెలివరీ కంపెనీ ఫార్మ్‌ఈజీ మాతృసంస్థ 'ఏపీఐ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్' పబ్లిక్ ఇష్యూకి సెబీ గత నెలలోనే ఆమోదం తెలిపింది. దాదాపు రూ.6,250 కోట్లు సమీకరించేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. మార్చి 2022 నాటికి ఐపీఓకి రావాలని భావించినప్పటికీ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రూపంలో బ్రేకులు పడ్డాయి. ఫార్మ్‌ఈజీ ఇప్పటి వరకు ఔషధాలు, డయాగ్నోస్టిక్ కిట్లు, ఇతర ఆరోగ్య సంరక్షణా కిట్లు కలుపుకొని మొత్తం 15 మిలియన్ల ఆర్డర్లను దాదాపు 5 మిలియన్ల కుటుంబాలకు అందజేసింది. మొత్తం 1000 పట్టణాలకు ఈ సంస్థ సేవలు విస్తరించాయి. థైరోకేర్ టెక్నాలజీస్‌లో 611 మిలియన్ డాలర్లతో మెజారిటీ వాటాను ఇటీవలే కొనుగోలు చేసింది. ఏపీఐ హోల్డింగ్స్ జూన్‌లో 420 మిలియన్ డాలర్ల పెట్టుబడులు సమీకరించింది. దీంతో సంస్థ విలువ 4.1 బిలియన్ డాలర్లకు చేరింది. నాస్పర్స్, టీపీజీ, టెమాసెక్ వంటి కంపెనీలు దీంట్లో పెట్టుబడులు పెట్టాయి. వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతలను ఈ కంపెనీ వినియోగించుకుంటోంది.