కరోనా లాస్ రికార్డ్: 69 రోజులు... 16 వేల పాయింట్లు - స్టాక్ మార్కెట్ వార్తలు
41,953... సెన్సెక్స్ జీవనకాల గరిష్ఠం. జనవరి 14న ఈ రికార్డు నమోదైంది. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. ప్రస్తుతం 26 వేల మార్కుకు దిగువకు పతనమైంది సెన్సెక్స్. ఎందుకిలా? ఈ 69 రోజుల్లో ఏం జరిగింది?
సెన్సెక్స్
By
Published : Mar 23, 2020, 4:24 PM IST
|
Updated : Mar 23, 2020, 5:26 PM IST
యుద్ధాలు... వాణిజ్య యుద్ధాలు... కుంభకోణాలు... ఇలా ఎన్నో సంక్షోభాలను చూశాయి భారత స్టాక్ మార్కెట్లు. భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. కానీ... ఒక రోజులో కాకపోతే ఒక వారంలోనైనా తిరిగి పుంజుకున్నాయి. ఇదంతా గతం. ఇప్పుడు మాత్రం పరిస్థితి భిన్నం. కరోనా పంజా దెబ్బకు పతనాల పరంపర కొనసాగడమే తప్ప కోలుకునే పరిస్థితి కనిపించడంలేదు.
దలాల్ స్ట్రీట్లో ఈ రివర్స్ గేర్ మొదలై దాదాపు నెల అవుతోంది. కరోనా విజృంభిస్తున్న కొద్దీ మార్కెట్ పతనం మరింత తీవ్రమవుతోంది. నిత్యం లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరవుతోంది.
జీవితకాల గరిష్ఠం నుంచి...
2020 జనవరి 14న సెన్సెక్స్ జీవనకాల గరిష్ఠం 41,953 వద్ద, నిఫ్టీ జనవరి 16న జీవనకాల గరిష్ఠం 12,355 పాయింట్ల వద్ద ఉన్నాయి. కానీ ఈ రెండు నెలల్లో సెన్సెక్స్ సుమారు 16 వేల పాయింట్లు కోల్పోయింది. బీఎస్ఈ సూచీ ప్రస్తుతం (మార్చి 23) 25,981 పాయింట్లకు పతననైంది. నిఫ్టీ 7,610కి చేరింది.