మార్కెట్లపై బేర్ పంజా- 1190 మైనస్
ఒమిక్రాన్ భయాలు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు, ద్రవ్యోల్బణ భయాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1190 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 371 పాయింట్లు దిగజారింది.
విదేశీ సంస్థాగత మదుపరులు సొమ్మును తరలించటమూ మార్కెట్లను దెబ్బతీసింది. దాదాపు అన్ని రంగాల షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలు మార్కెట్లను కుదిపేసింది. 1000 పాయింట్లకుపైగా ట్రేడింగ్‌ను మొదలు పెట్టిన సెన్సెక్స్ అంతకంతకూ దిగజారి.. ఒకానొక దశలో బీఎస్ఈ సెన్సెక్స్ 1,849 పాయింట్లు(3.24 శాతం) నష్టపోయి.. 55,162కు పడిపోయింది. ఆ తర్వాత క్రమంగా పుంజుకుని.. 1189 పాయింట్ల నష్టంతో.. 55,822 వద్ద స్థిరపడింది.
జాతీయ స్టాక్ ఎక్సేంజీ సూచీ నిఫ్టీ.. 371 పాయింట్ల నష్టంతో.. 16,614 వద్ద ముగిసింది. ఒకానొక దశలో.. 566 పాయింట్లు(3.3 శాతం) మేర నష్టపోయి 16,418కు పడిపోయింది. ఆ తర్వాత కొనుగోళ్ల మద్దతు లభించటం వల్ల.. 16,614 వద్దకు చేరుకుని స్థిరపడింది.
లాభనష్టాల్లోనివి...
సిప్లా, హెచ్‌యూఎల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ లాభాలతో ముగిశాయి. బీపీసీఎల్, టాటాస్టీల్, టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్బీఐలు 4 శాతానికిపైగా నష్టాలను మూటగట్టుకున్నాయి.