తెలంగాణ

telangana

ETV Bharat / business

దలాల్​ స్ట్రీట్​లో బేర్​ పంజా- కుప్పకూలిన సెన్సెక్స్​

By

Published : Mar 12, 2020, 9:25 AM IST

Updated : Mar 12, 2020, 3:52 PM IST

stock
స్టాక్ మార్కెట్

15:48 March 12

రికార్డు స్థాయి నష్టాలు..

కరోనా భయాలతో స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయి నష్టాలను నమోదు చేశాయి. కరోనా వైరస్​ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో సూచీలు భారీగా కుదేలయ్యాయి.

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్​ 2,919 పాయింట్లు పతనమై 32,778 పాయింట్లకు దిగజారింది. 868 పాయింట్లు పడిపోయిన జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 9,590  పాయింట్లకు చేరింది.

14:47 March 12

3,000 దాటిన సెన్సెక్స్ నష్టాలు

సెన్సెక్స్ రికార్డు స్థాయి నష్టాలను నమోదు చేసింది. ఇంట్రాడే 3,000 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ కూడా 948 పాయింట్లు పడిపోయింది. 

14:24 March 12

రికార్డు పతనాలు నమోదు

దేశీయ మార్కెట్లపై అంతర్జాతీయ పరిణామాలు బలంగా పనిచేస్తున్నాయి. కరోనా వైరస్​పై డబ్ల్యూహెచ్​ఓ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ ప్రకటనల నేపథ్యంలో సెన్సెక్స్​, నిఫ్టీ పతనాల్లో కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి.  

ఉదయం నుంచి భారీ నష్టాల్లోనే స్టాక్​ మార్కెట్లు ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్​ 2,608 పాయింట్ల పతనమై 33,090 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. 764 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 9,695 పాయింట్లకు పడిపోయింది.  

ఇంట్రాడే అత్యధికం..

ఒకానొక దశలో ఇంట్రాడేలో సెన్సెక్స్, నిఫ్టీ​ అత్యంత భారీ పతనాన్ని నమోదు చేశాయి. పాత రికార్డులను బద్దలుకొడుతూ బీఎస్​ఈ సూచీ 2,707 పాయింట్లు, ఎన్​ఎస్​ఈ సూచీ 810 పాయింట్లు పడిపోయాయి.  

సెషన్​ ప్రారంభానికి ముందు బీఎస్​ఈ మార్కెట్ విలువ రూ.137 లక్షల కోట్లుగా ఉంది. ఈ స్థాయి పతనాలతో మదుపరుల సంపద రూ.9.15 లక్షల కోట్లు హరించుకుపోయింది.  

అన్ని నష్టాలే..

అన్నీ రంగాల షేర్లపై బేర్​ విరుచుకుపడింది. యాక్సిస్​ బ్యాంకు, ఎస్బీఐ, హీరో మోటోకార్ప్​, ఐటీసీ, బజాజ్​ ఆటో, మహీంద్ర అండ్ మహీంద్ర, టైటాన్​ భారీ నష్టాల్లో ఉన్నాయి.  

11:47 March 12

రూ.11 లక్షల కోట్లు ఆవిరి..

స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమైన వేళ మదుపరులు భారీగా నష్టపోయారు. అంతర్జాతీయ పరిణామాలతో అమ్మకాల ఒత్తిడి పెరగటం వల్ల మదుపరుల సంపద రూ.11 లక్షల కోట్లు ఆవిరైంది.  

ఉదయం 11.09  సమయంలో సెన్సెక్స్​ 2,582 పాయింట్లు కోల్పోయి 33,114 పాయింట్లకు చేరి 52 వారాల కనిష్ఠాన్ని తాకింది. నిఫ్టీ 767 పాయింట్లు నష్టపోయి ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది.  

స్టాక్​ మార్కెట్లు ప్రారంభమైన  నిమిషంలోనే రూ.6 లక్షల కోట్లను నష్టపోయారు మదుపరులు. అనంతరం 10.30 గంటలకు 1,800 పాయింట్ల నష్టంలో ఉండగా రూ.8.5 లక్షల కోట్లను కోల్పోయారు. 11 గంటలకు ఆ నష్టం రూ.11లక్షల కోట్లకు చేరింది.  

ఇదే తీరు కొనసాగితే కొద్దిసేపు ట్రేడింగ్​ను నిలిపివేసే అవకాశం ఉంది.  

అన్ని నష్టాల్లోనే..

టాటా మోటార్స్​, ఎస్ బ్యాంకు, యాక్సిస్​ బ్యాంకు, టాటా స్టీల్, ఎస్బీఐ, ఓఎన్​జీసీ, సన్​ఫార్మా, టైటాన్​ భారీ నష్టాల్లో ఉన్నాయి.  

కమ్మేసిన భయాలు..

సూచీల పరిస్థితి ఏమాత్రం బాగోకపోవడం వల్ల ఎఫ్‌ఐఐలు కూడా మార్కెట్లను వీడుతున్నారు. ఈ క్రమంలో షేర్లు మరింత పతనం అయి భయాలను ఎగదోస్తున్నాయి. నిఫ్టీ 10వేల మార్కు కిందకు రావడం, 700 పాయింట్లకు పైగా పతనం కావడం మదుపరుల సెంటిమెంట్‌ను భారీగా దెబ్బతీసింది. ఇదంతా ఒక గొలుసుకట్టు వ్యవస్థలా పనిచేసి మార్కెట్లలో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. భారీ షేర్లు ఏవీ లాభాల్లో ట్రేడ్‌ కావట్లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

11:28 March 12

రికార్డు నష్టాల వైపు మార్కెట్లు..

ఆసియా మార్కెట్ల పతనం, చమురు ధరల క్షీణత ప్రభావం దేశీయ మార్కెట్లపై భారీగా పడింది. అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాల ఒత్తిడి నెలకొంది. సెన్సెక్స్​ 2,420 పాయింట్ల నష్టపోయి 33,277 పాయింట్లకు చేరింది. నిఫ్టీ 736 పాయింట్లు కోల్పోయింది. 

11:00 March 12

సెన్సెక్స్​ 2,300 పాయింట్ల పతనం

స్టాక్​ మార్కెట్లు రికార్డు స్థాయి నష్టాలవైపు దూసుకెళుతున్నాయి. సెన్సెక్​ 2,364 పాయింట్లు పతనమైన 33,333 పాయింట్లకు పడిపోయింది. నిఫ్టీ 710 పడిపోయి ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది.  

10:45 March 12

8 లక్షల కోట్లు ఆవిరి..

స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమైన వేళ మదుపరులు భారీగా నష్టపోయారు. తొలుత 1,864 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్​ 33,833కు చేరుకుంది. ఫలితంగా మదుపరుల సంపద రూ.8,56,690 కోట్లు ఆవిరైంది.  

ప్రస్తుతం సెన్సెక్స్​ 1,927 పాయింట్లు కోల్పోయి 33,770 పాయింట్లకు చేరి 52 వారాల కనిష్ఠాన్ని తాకింది. నిఫ్టీ 581 పాయింట్లు నష్టపోయి 9,878 పాయింట్లకు చేరింది.  

టాటా మోటార్స్​, ఎస్ బ్యాంకు, యాక్సిస్​ బ్యాంకు, టాటా స్టీల్, ఎస్బీఐ, ఓఎన్​జీసీ, సన్​ఫార్మా, టైటాన్​ భారీ నష్టాల్లో ఉన్నాయి. 

09:52 March 12

ట్రంప్​, డబ్ల్యూహెచ్​ఓ ప్రకటనలతో క్షీణత

అంతర్జాతీయ పరిణామాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 1,681 పాయింట్లు నష్టపోయి 34,016 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 503 పాయింట్లు కోల్పోయి 9,955 పాయింట్లకు పడిపోయింది.  

అన్ని నష్టాల్లోనే..

అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే ఉన్నాయి. టాటా మోటార్స్​, టాటా స్టీల్​, ఓఎన్​జీసీ, అదానీ పోర్ట్స్​, జేఎస్​డబ్ల్యూ స్టీల్​, ఎస్బీఐ, రిలయన్స్​, బజాజ్​ ఫినాన్స్​, ఇండస్ ఇండ్ బ్యాంకు భారీగా నష్టపోయాయి.  

కరోనా పరిణామాలే కారణం..

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్​ను అంతర్జాతీయ వ్యాధిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్​ఓ ప్రకటించింది. ఫలితంగా ఆసియా మార్కెట్లు కుప్పకూలాయి.  

వాషింగ్టన్​ డీసీలో అత్యవసర పరిస్థితిని విధించారు. బ్రిటన్​ మినహా ఐరోపాకు 30 రోజులపాటు రాకపోకలను నిలిపేయాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ ప్రకటన మరింత ప్రతికూల ప్రభావం చూపింది. ఆసియా మార్కెట్లనీ 3 నుంచి 4 శాతం నష్టాల్లో సాగుతున్నాయి. 

చమురు ధరల పతనం

ఫలితంగా అంతర్జాతీయ చమురు ధరలు 6 శాతం పడిపోయాయి. డబ్ల్యూటీఐ క్రూడ్​ ఆయిల్ ధర 31 డాలర్లు, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 34 డాలర్లకు చేరాయి.

రూపాయి మారకం..

అంతర్జాతీయ పరిణామాలతో రూపాయి విలువ భారీగా పడిపోయింది. 82 పైసలు క్షీణించిన రూపాయి మారకం విలువ డాలరుతో పోలిస్తే 74.50కు చేరుకుంది.  

09:20 March 12

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిణామాలతో దేశీయ స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్​ 1,566 పాయింట్లు కోల్పోయి 34,131 పాయింట్లకు పడిపోయింది.  

నిఫ్టీ 469 పాయింట్లు క్షీణించి 9,989 పాయింట్లకు చేరుకుంది. 

Last Updated : Mar 12, 2020, 3:52 PM IST

ABOUT THE AUTHOR

...view details