స్టాక్స్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు భారీ స్థాయిలో అమ్మకాలకు కారణమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్.. 1,433 పాయింట్లకుపైగా నష్టంతో.. 56,719 వద్ద కదలాడుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 434 పాయింట్లు కోల్పోయి.. 16,940 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
ఉక్రెయిన్ ఆక్రమణకు ఆ దేశ సరిహద్దుల్లో రష్యా యుద్ధ విన్యాసాలు చేస్తోంది. మరోవైపు ఇందుకు వ్యతిరేకంగా అమెరికా రంగంలోకి దిగి పుతిన్‌ను హెచ్చరించడం మరింత హీటును రాజేసింది. ఈ పరిణామాలు కచ్చితంగా అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం చూపుతాయని వార్తలు మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో మార్కెట్లు భారీ నష్టాల దిశగా అడుగులు వేస్తున్నాయి.
మరోవైపు అమెరికాలో వడ్డీరేట్లను ఏ స్థాయిలో, ఎప్పుడు పెంచుతారనే అంశాలపై కూడా మదుపరులు దృష్టి సారించారు. ఫెడరల్ రిజర్వ్ జనవరి సమావేశ ముఖ్యాంశాలు బుధవారం వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ సంస్థాగత మదుపరులు అమ్మకాలకు ఎగబడ్డారు. దీంతో ప్రారంభం నుంచి సూచీలు ఎర్ర రంగు పులుముకున్నాయి.
దేశీయంగా జనవరి ద్రవ్యోల్బణ గణాంకాలు నేడు విడుదలయ్యాయి. ద్రవ్యోల్బణం గత నెలతో పోల్చితే తగ్గినా... ఆశించిన స్థాయిలో లేకపోవడం మదుపరులను నిరాశపరిచింది. దీంతో ఎఫ్ఎంజీసీ స్టాక్స్ కూడా నష్టాలను ఎదుర్కొన్నాయి.
అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పెరుగుదల కూడా సూచీలపై ప్రభావం చూపింది.
స్టాక్ మార్కెట్లో బడా షేర్లు కూడా నేల చూపులు చూస్తున్నాయి. ఇది కూడా అమ్మకాలను ప్రోత్సహిస్తోంది.
ఆటో, మెటల్, బ్యాంకింగ్ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
సెన్సెక్స్ 2.47 శాతం , నిప్టీ 2.52 శాతం మేర నష్టపోయాయి.
ముప్పై షేర్ల ఇండెక్స్‌లో ఒక్క టీసీఎస్ మాత్రమే లాభాల్లో ఉంది.