Market Earnings: రికార్డులు.. రిటర్న్‌లు.. రిటైల్ ఇన్వెస్టర్లు.. 2021లో స్టాక్ మార్కెట్ గురించి చెప్పాలంటే ఈ పదాలు సరిపోతాయేమో.
సెన్సెక్స్ 50,000 పాయింట్లు, 60,000 పాయింట్ల మైలురాళ్లను అధిగమించింది ఈ ఏడాదే. నిఫ్టీ వారానికో రికార్డుతో 18000 పాయింట్లను చేరిందీ ఈ సంవత్సరమే. ఇక.. కొత్త జీవన కాల గరిష్ఠాలైతే ఎన్ని సార్లు మారాయో..
కొవిడ్-19 రెండో దశ పరిణామాలు చోటుచేసుకున్నా.. ఆఖర్లో కొత్త ఉత్పరివర్తనం ఒమిక్రాన్ కేసులు భయపెడుతున్నా, మదుపర్లకు సెన్సెక్స్, నిఫ్టీలు అందించిన రిటర్న్‌లు (ప్రతిఫలం) 20 శాతం పైనే..
మార్కెట్ దూకుడులో, ఐపీఓల జోరులో ఈ ఏడాది కీలక పాత్ర పోషించింది రిటైల్ (చిన్న) మదుపర్లే. మునుపెన్నడూ లేనంతగా డీమ్యాట్ ఖాతాల సంఖ్య భారీగా, దూకుడుగా పెరగడమే కాదు.. క్రమానుగత పెట్టుబడి పథకాలైన సిప్‌లలో పెట్టబడులు రూ.లక్ష కోట్లకు చేరడమే ఇందుకు తార్కాణం. అందుకే 2021ను రిటైల్ ఇన్వెస్టర్ల నామ సంవత్సరమని పిలవ వచ్చేమో.. విదేశీ మదుపర్లు విక్రయాలకు దిగినా, సూచీలు మరీ క్షీణించకుండా నిలిచింది కూడా రిటైల్ మదుపర్ల వల్లే.
ఒకటా.. రెండా.. ఎన్నెన్ని రికార్డులు.. సెన్సెక్స్.. నిఫ్టీ.. జోడు గుర్రాల్లా దూసుకెళ్లాయి.. మదుపర్లను లాభాశ్చర్యంలో ముంచెత్తాయి. బడ్జెట్ తర్వాత నుంచి ఆరంభమైన సూచీల జోరుకు.. కొవిడ్-19 రెండో దశ పరిణామాలతో మధ్యలో కళ్లెం పడింది. 2020 మార్చి తరహాలో మార్కెట్లు మళ్లీ భారీగా పతనమవుతాయనే భయాలూ వెంటాడాయి. వాటన్నింటినీ పటాపంచాలు చేస్తూ ఆ తర్వాత సూచీలు చెలరేగాయి. రికార్డు మైలురాళ్లను ఒక్కొక్కటి అధిగమిస్తూ.. కొత్త శిఖరాలను అధిరోహించాయి. 'మార్కెట్ బాగా పెరిగింది.. ఇక నుంచి పడిపోతుందేమో' అని అనుకున్న ప్రతిసారీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. దూసుకెళ్లింది. మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలోని కంపెనీల మార్కెట్ విలువ 2020 డిసెంబరు ఆఖరుకు రూ.1,88,03,518.60 కోట్లుగా ఉండగా.. ఇప్పుడు రూ.75,00,000 కోట్లు పెరిగి రూ.2,63,14,475.66 కోట్లకు చేరింది. నిఫ్టీ 19,000 పాయింట్లను చేరకపోవడం, పేటీఎం షేర్ల పేలవ నమోదు మినహా.. సంవత్సరమంతా స్టాక్ మార్కెట్ లాభప్రదంగానే గడిచింది. అందుకే 2021.. నిన్ను మరిచేదేలే!!
కలిసొచ్చాయి ఇవే..