Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం తీవ్ర ఒడుదొడుకుల మధ్య సాగాయి. ఆరంభంలో భారీ లాభాలు నమోదు చేసినప్పటికీ కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆఖరి గంటలో మళ్లీ కొనుగోళ్ల ఊతంతో సూచీలు లాభాల్లో ముగిశాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 113 పాయింట్లు పెరిగింది. 57 వేల 901 వద్ద సెషన్‌ను ముగించింది.
సెషన్ ఆరంభంలో సెన్సెక్స్ ఓ దశలో 540 పాయింట్లకుపైగా పెరగడం విశేషం. 58 వేల 337 వద్ద సెషన్ గరిష్ఠాన్ని తాకింది. కొద్దిసేపటికి 100 పాయింట్ల నష్టంతో 57 వేల 683 పాయింట్ల కనిష్ఠస్థాయికి చేరింది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 27 పాయింట్ల లాభంతో.. 17 వేల 248 వద్ద స్థిరపడింది.
ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్ రంగం షేర్లు రాణించాయి. విద్యుత్తు, ఆర్థిక, రియల్టీ, బ్యాంకింగ్, ఫార్మా రంగం షేర్లు డీలా పడిపోయాయి.