Stock Market Close: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలకు తోడు.. దేశీయంగా ఆటో, లోహ, బ్యాంకింగ్ రంగాలు పుంజుకోవటం వల్ల దేశీయ మార్కెట్లు వరుసగా రెండోరోజు భారీ లాభాల్లో ముగిశాయి. మంగళవారం సెషన్లో 497 పాయింట్లు పెరిగిన బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్.. బుధవారం 612 పాయింట్లు పెరిగింది. 56 వేల 931 వద్ద స్థిరపడింది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 185 పాయింట్ల లాభంతో.. 16 వేల 955 వద్ద సెషన్‌ను ముగించింది.
ఒమిక్రాన్ భయాలు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు, ద్రవ్యోల్బణ భయాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం సెషన్లో భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1190 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 371 పాయింట్లు దిగజారింది. ఆ తర్వాత వరుసగా రెండు సెషన్లలో బుల్ జోరు చూపించింది.
లాభనష్టాల్లోనివి..
బ్యాంకింగ్, విద్యుత్తు రంగాలు అత్యధిక లాభాలను నమోదు చేశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీ, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి హెవీవెయిట్ షేర్లు రాణించి మార్కెట్లకు ఊతమిచ్చాయి.