లావాదేవీలు సులభంగా, సురక్షితంగా తక్కువ వ్యయంతో నిర్వహించుకునే వీలుండటమే తమ సంస్థ వృద్ధికి కారణమని ఆన్‌లైన్ స్టాక్‌బ్రోకింగ్ సంస్థ 'గ్రో' సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ హర్ష్ జైన్ పేర్కొన్నారు. చిన్న పట్టణాల నుంచీ స్టాక్‌మార్కెట్లోకి పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య పెరిగిందని చెప్పారు. 'ఈనాడు'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక విషయాలు వెల్లడించారు.
ఎన్నో సంస్థలు ఆర్థిక/స్టాక్ మార్కెట్ ఆధారిత సేవలు అందిస్తున్నాయి. మీ ప్రత్యేకతలు ఏమిటి?
యువతను ఆకర్షించేందుకు, వారు పెట్టుబడులు పెట్టేందుకు గ్రో ఎంతో సులువైన, పారదర్శక వేదికను అందిస్తోంది. మదుపరి తాను అనుకున్న ఏ పథకంలోనైనా మదుపు చేసేలా చూడటమే గ్రో లక్ష్యం. సరైన పెట్టుబడి నిర్ణయం తీసుకునేందుకు, అవసరమైన సమాచారం అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. ట్రేడింగ్ లావాదేవీకి రూ.20 మినహా, ఇతర ఛార్జీలేమీ లేకుండా, సులువుగా మదుపు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నాం.
గత అయిదేళ్లలో గ్రో ఎంతో వృద్ధి సాధించింది. ఇందుకు దోహదం చేసినవేమిటి?
దేశంలో 20 కోట్ల మందికి పైగా పెట్టుబడులు పెట్టే ఆర్థిక స్తోమత ఉన్నా, 4-5 కోట్ల మందే ఈక్విటీల్లో మదుపు చేస్తున్నారు. చాలామంది భారతీయుల డబ్బు.. బ్యాంకు పొదుపు ఖాతాలకే పరిమితం అవుతోంది. దీనివల్ల వారికి వస్తున్న రాబడి తక్కువే. అదే సమయంలో విదేశీ సంస్థాగత మదుపరులు మన ఆర్థిక వ్యవస్థ వృద్ధిని సొమ్ము చేసుకుంటున్నారు. రిటైల్ మదుపరుల్లో ముఖ్యంగా సంపాదన శక్తి ఉన్న యువతను ఈక్విటీ పెట్టుబడుల్లో భాగస్వాములను చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. కొవిడ్ పరిణామాల వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని, వడ్డీ రేట్లు తగ్గాయి. మంచి షేర్లు తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చాయి. ఆఫీసులకు వెళ్లే వారు.. ఇంటి నుంచి పని చేయడం ప్రారంభించారు. దీంతో వారు తమ దగ్గరున్న మిగులు మొత్తాన్ని ఎలా పెట్టుబడి పెట్టాలో నేర్చుకునే ప్రయత్నం చేశారు. గ్రో లాంటి యాప్‌లు అందుబాటులోకి రావడంతో, కాగిత రహితôగా, ఎవరినీ కలవాల్సిన పని లేకుండా.. నిమిషాల్లోనే మార్కెట్లో పెట్టుబడులు సాధ్యం అయ్యాయి. తక్కువ బ్రోకరేజీ, ఒకే వేదికపై ఎన్నో రకాల పెట్టుబడి పథకాలు అందుబాటులో ఉండటమూ మరో కారణం.
చిన్న మదుపరులు పెట్టుబడులు పెట్టేందుకు సాంకేతికత ఎంత మేరకు తోడ్పాటునందిస్తోంది?
తక్కువ, స్థిర రాబడి వచ్చే సంప్రదాయ పెట్టుబడి పథకాల నుంచి ఆర్థిక పెట్టుబడులను ఆకర్షణీయ ప్రతిఫలాలు వచ్చే పథకాల్లోకి మళ్లించేందుకు సాంకేతికత ఉపయోగపడుతోంది. ఫ్లిప్‌కార్ట్‌లో నేను పనిచేస్తున్నప్పుడు, వినియోగదారుల అంచనాలను అందుకుంటే విజయం సాధించే అవకాశాలు ఎన్నో రెట్లు పెరుగుతాయని గమనించాను. పెట్టుబడులకూ ఇదే వర్తిస్తోంది.
ఏ వయసు వారు ఇపుడు ఎక్కువగా మదుపు చేస్తున్నారు.?