అంతర్జాతీయ సానుకూల పరిస్థితులకు తోడు ఇన్ఫోసిస్ ముడో త్రైమాసిక ఫలితాల ప్రభావంతో మార్కెట్లు దూసుకెళ్లాయి. ఐటీ షేర్లు రాణించడం వల్ల సెన్సెక్స్, నిఫ్టీలు జీవితకాల గరిష్ఠాన్ని తాకాయి. మూడు నెలల క్షీణత అనంతరం 2019 నవంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి 1.8 శాతం మేర వృద్ధి చేయడం కూడా మార్కెట్లలో సానుకూల ప్రభావం చూపించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ- సెన్సెక్స్ 260 పాయింట్లు వృద్ధి చెంది 41,860 పాయింట్ల సరికొత్త శిఖరాల వద్ద ముగిసింది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ- నిఫ్టీ 73 పాయింట్లు లాభపడి 12,330 వద్ద గరిష్ఠ స్థాయి వద్ద స్థిరపడింది.
లాభనష్టాల్లోనివి
ఇన్ఫోసిస్ భారీగా లాభపడింది. నేటి ట్రేడింగ్‌లో సుమారు 4.76 శాతం మేర లాభాలను గడించింది. శుక్రవారం సంస్థ విడుదల చేసిన త్రైమాసిక ఫలితాలు మార్కెట్లలో జోరు నింపాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, హెచ్‌యూఎల్, మహీంద్ర అండ్ మహీంద్ర, టాటా స్టీల్, పవర్‌గ్రిడ్, టెక్ మహీంద్ర షేర్లు లాభాల్లో ముగిశాయి.
టీసీఎస్, ఎస్బీఐ, బజాజ్ ఆటో, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, నెస్లే ఇండియా షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి.