తెలంగాణ

telangana

ETV Bharat / business

బేర్​ గుప్పిట్లో మార్కెట్లు- రికార్డు పతనాలు నమోదు - స్టాక్ మార్కెట్​ వార్తలు

స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. కరోనా వైరస్​ మూలంగా అంతర్జాతీయంగా నెలకొన్న ఆందోళనలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఫలితంగా సూచీలు సెన్సెక్స్​, నిఫ్టీ.. పతనాల్లో కొత్త రికార్డులను సృష్టించాయి.

bear market
బేర్​

By

Published : Mar 12, 2020, 2:24 PM IST

దేశీయ మార్కెట్లపై అంతర్జాతీయ పరిణామాలు బలంగా పనిచేస్తున్నాయి. కరోనా వైరస్​పై డబ్ల్యూహెచ్​ఓ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ ప్రకటనల నేపథ్యంలో సెన్సెక్స్​, నిఫ్టీ.. పతనాల్లో కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి.

ఉదయం నుంచి భారీ నష్టాల్లోనే స్టాక్​ మార్కెట్లు ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్​ 2,216 పాయింట్ల పతనమై 33,481 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. 662 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 9,796 పాయింట్లకు పడిపోయింది.

ఇంట్రాడే అత్యధికం..

ఒకానొక దశలో ఇంట్రాడేలో సెన్సెక్స్, నిఫ్టీ​ అత్యంత భారీ పతనాన్ని నమోదు చేశాయి. పాత రికార్డులను బద్దలుకొడుతూ బీఎస్​ఈ సూచీ 2,707 పాయింట్లు, ఎన్​ఎస్​ఈ సూచీ 810 పాయింట్లు కోల్పోయాయి.

సెషన్​ ప్రారంభానికి ముందు బీఎస్​ఈ మార్కెట్ విలువ రూ.137 లక్షల కోట్లుగా ఉంది. ఈ స్థాయి పతనాలతో మదుపరుల సంపద రూ.9.15 లక్షల కోట్లు హరించుకుపోయింది.

అన్ని నష్టాలే..

అన్నీ రంగాల షేర్లపై బేర్​ విరుచుకుపడింది. యాక్సిస్​ బ్యాంకు, ఎస్బీఐ, హీరో మోటోకార్ప్​, ఐటీసీ, బజాజ్​ ఆటో, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్​ భారీ నష్టాల్లో ఉన్నాయి. ఎస్​ బ్యాంకు షేర్లు 31 శాతం నష్టపోయాయి.

ట్రంప్ ప్రకటన..

ఐరోపాలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోన్న నేపథ్యంలో చాలా రోజుల తర్వాత ప్రజలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు ట్రంప్​. బ్రిటన్​ మినహా ఐరోపా దేశాలన్నింటికీ 30 రోజుల పాటు ప్రయాణాలను నిలిపేస్తున్నట్లు ప్రకటించారు.

కరోనా వైరస్​ను అంతర్జాతీయ మహమ్మారిగా డబ్ల్యూహెచ్​ఓ ప్రకటించిన తర్వాత ఆసియా మార్కెట్లు భారీగా పడిపోయాయి. ట్రంప్ చేసిన ప్రసంగం అనంతరం మరింత దిగజారాయి.

ABOUT THE AUTHOR

...view details