భారత్‌లో కరోనా వైరస్‌కు సంబంధించి తొలి కేసు నమోదైనందున స్టాక్ మార్కెట్లలో ప్రతికూల ప్రభావం పడింది. రిలయన్స్ వంటి భారీ షేర్లు పతనమవడం వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఓ దశలో 550 పాయింట్లు కోల్పోయిన బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ చివరకు 285 పాయింట్ల నష్టంతో... 40,913 పాయింట్ల వద్ద ముగిసింది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 94 పాయింట్లు నష్టపోయింది. చివరకు 12,035 పాయింట్ల వద్ద స్థిరపడింది.
జనవరి ఫ్యూచర్, ఆప్షన్ కాంట్రాక్టుల గడువు ముగుస్తున్నందున సూచీలపై ప్రతికూల ప్రభావం పడినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బడ్జెట్‌కు ముందు ఆందోళనలో ఉన్న మదుపరులు భారీ షేర్ల అమ్మకానికి మొగ్గుచూపడం వల్ల మధ్యాహ్నం నుంచి మార్కెట్లు మరింత పతనమయ్యాయి.
లాభనష్టాల్లోనివివే
సెన్సెక్స్‌లోని 30 షేర్లలో బజాజ్ ఆటో, పవర్‌గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ, మారుతీ, ఎల్అండ్టీ షేర్లు లాభాలు గడించాయి.
రిలయన్స్ షేర్లు అత్యధికంగా 2.62 శాతం మేర నష్టపోయాయి. నెస్లే ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ నష్టాలు మూటగట్టుకున్నాయి.