దేశ ఆర్థిక వ్యవస్థ కొవిడ్-19 ప్రభావం నుంచి ఇంకా కోలుకోలేదు. గత ఆర్థిక సంవత్సరం(2019-20)లో సాధించిన 4.18 శాతం వృద్ధి రేటే తక్కువనుకుంటే, కరోనా మహమ్మారి వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో జీడీపీ వృద్ధి లేకపోగా, క్షీణతను నమోదు చేయనుంది. ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతోందనే సంకేతాలు వెలువడుతున్నాయి. కానీ స్టాక్‌మార్కెట్ సూచీలేమో అనూహ్యంగా గరిష్ఠ స్థాయుల్లో దూసుకుపోతున్నాయి.
2020 మార్చిలో కొవిడ్ లాక్‌డౌన్ ప్రారంభంలో ఒక్కసారిగా పతనమైన స్టాక్‌మార్కెట్లు ఆపై నెమ్మదిగా కోలుకున్నాయి. నవంబరు నుంచి పట్టపగ్గాల్లేకుండా సూచీలు లాభపడుతూ వచ్చాయి. గురువారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 50,000 పాయింట్ల చరిత్రాత్మక స్థాయిని సైతం అందుకుంది. తదుపరి లాభాల స్వీకరణతో, శుక్రవారం సాయంత్రానికి సెన్సెక్స్ 49,000 పాయింట్ల దిగువకు వచ్చింది. ఇటీవల సూచీల దూకుడుతో ఎంతో మంది కొత్త మదుపరులు స్టాక్‌మార్కెట్లో అడుగుపెట్టారు. లాభాలు అధికంగా వస్తాయనే ఆశతో పెద్దఎత్తున షేర్లపై పెట్టుబడులు పెడుతున్నారు. ఆర్థిక వ్యవస్థ ఇంకా పూర్తిగా కోలుకోని నేపథ్యంలో, మదుపరులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి...తదితర అంశాలపై...
కుదుటపడుతున్నాయ్..
'లాక్‌డౌన్' ఆంక్షలు తొలగిపోవడం, కొవిడ్ ముప్పు కొంత తగ్గడం, టీకా ఆవిష్కరణ వల్ల ఆర్థిక కార్యకలాపాలు ఇప్పుడిప్పుడే జోరందుకుంటున్నాయి. విద్యుత్తు వినియోగంతో పాటు వాహన అమ్మకాలు పెరుగుతున్నాయి. రుణాల్లో వృద్ధి కనిపిస్తోంది. మళ్లీ ప్రైవేటు పెట్టుబడులు మొదలయ్యే సంకేతాలున్నాయి.
స్థిరీకరణ, రుణాల రికవరీపై దృష్టి సారించడం వల్ల బ్యాంకులు బలోపేతమై, వ్యాపార సంస్థల విస్తరణ అవసరాలకు అనుగుణంగా రుణాలిచ్చేందుకు సిద్ధపడుతున్నాయి. కార్పొరేట్ రంగాన్ని చూస్తే.. ఎన్నో సంస్థలు అప్పులు తగ్గించుకున్నాయి. గత కొన్నేళ్లలో జీఎస్‌టీ- ఐబీసీ(దివాలా స్మృతి) అమలుకు తోడు కొవిడ్ పరిణామాల వల్ల బలహీన కార్పొరేట్ సంస్థలు మూతపడగా, తట్టుకున్నవి బలోపేతమయ్యాయి. ఇలా నిలిచిన సంస్థల మార్కెట్ వాటా, ఆదాయాలు పెరుగుతున్నాయి. అందువల్ల వచ్చే ఆర్థిక సంవత్సరం, ఆపై ఏడాది భారత్ అధిక వృద్ధి రేటు నమోదు చేస్తుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. అదే స్టాక్‌మార్కెట్‌కు ఇంధనం.
స్టాక్‌మార్కెట్ జోరు
ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను స్టాక్‌మార్కెట్లు ప్రతిఫలిస్తాయి. పతనం, వృద్ధి ఏదైనా.. మార్కెట్లు ముందే స్పందిస్తాయి. ఆర్థికాభివృద్ధి వచ్చే ఏడాది నుంచి బాగుంటుందంటే, ఇప్పటి నుంచే పెరుగుతాయి. ఇప్పుడు జరుగుతోంది అదే. ఆర్థిక వ్యవస్థ బాగా లేకపోయినా, సమీప భవిష్యత్తులో కోలుకుంటుందని, కంపెనీలు అధిక ఆదాయాలు నమోదు చేస్తాయనే అంచనాలతో షేర్లలో పెట్టుబడులు పెట్టేందుకు మదుపరులు ముందుకొస్తున్నారు. కొత్త ఇన్వెస్టర్లకు అనుగుణంగా డీమ్యాట్ ఖాతాల సంఖ్య వేగంగా పెరుగుతోంది.
అప్రమత్తత అవసరం
షేర్ల ధరలు, స్టాక్‌మార్కెట్ సూచీల్లో హెచ్చుతగ్గులు సహజం. సూచీలు బాగా పెరిగినందున 'దిద్దుబాటు'కు అస్కారం ఉందని, అది ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేమని స్టాక్‌మార్కెట్ నిపుణులు అంటున్నారు. దీనికి తోడు కేంద్ర బËడ్జెట్..అనేది పెద్ద సందర్భం. అమెరికాలో కొత్త అధ్యక్షుడి నిర్ణయాలు ఎలా ఉంటాయి, దాని ప్రభావం అమెరికా/ప్రపంచ ఆర్థిక వ్యవస్థల మీద ఎలా ఉంటుందనేదీ కీలకమే. దూకుడుగా స్టాక్‌మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్న యువ ఇన్వెస్టర్లకు 'మార్కెట్ రిస్క్'పై అవగాహన ఉండకపోవచ్చు. కాస్త అటూఇటూ అయినా భారీనష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తుందనేది వారు గుర్తించాలి. అప్రమత్తత పాటించటం, లాభాల్లో ఉంటే కొంతైనా వెనక్కి తీసుకోవడం, స్థిరంగా ఆదాయాలు ఆర్జించే కంపెనీల మీద పెట్టుబడులు కొనసాగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో -23.9%, రెండో త్రైమాసికంలో -7.5% వృద్ధి నమోదయ్యాయి. మూడు, నాలుగో త్రైమాసికాల్లో సానుకూల వృద్ధి నమోదవుతుందనే అంచనాలున్నాయి.
పరుగుకు కారణాలు పరిశీలిస్తే..
వడ్డీరేట్లు బాగా తక్కువగా ఉన్నాయి. ఏడాది కాలానికి బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేటు 5- 5.5% ఉంది. దీనికంటే ఎక్కువ ప్రతిఫలం వస్తుందనే ఆశతో షేర్లలో పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగానూ ఇదే పరిస్థితి. ఎన్నో దేశాల్లో సున్నా వడ్డీకి రుణాలు లభిస్తున్నాయి. దీంతో పలు విదేశీ సంస్థలు అధిక లాభాల కోసం మనదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. ఇందులో ఎక్కువ సొమ్ము స్టాక్‌మార్కెట్లోకి ప్రవహిస్తోంది. గత త్రైమాసికంలో విదేశీ సంస్థలు రూ.లక్షన్నర కోట్లకు పైగా ఈక్విటీలో పెట్టుబడులు పెట్టడం గమనార్హం.