సౌందర్య, సంరక్షణ ఉత్పత్తుల ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ 'నైకా'ను(Nykaa IPO) నిర్వహిస్తున్న ఎఫ్‌ఎస్‌ఎన్ ఇ-కామర్స్ వెంచర్స్.. స్టాక్ మార్కెట్లలోకి ఘనంగా అడుగుపెట్టింది. బుధవారం ఈ సంస్థ షేర్లు 80శాతం ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి. దీంతో ఈ సంస్థ మార్కెట్ విలువ ఏకంగా రూ.లక్ష కోట్లు దాటేసింది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఎన్‌ఎస్‌ఈలో నైకా షేరు ధర రూ.2,018తో(Nykaa share price NSE) ట్రేడింగ్‌ను మొదలుపెట్టింది. ఇష్యూ ధర రూ.1,125 కంటే ఇది 79.37శాతం ఎక్కువ. ఇక బీఎస్‌ఈలో ఇష్యూ ధర కంటే 77.86శాతం ఎక్కువగా రూ.2,001 ధరతో ప్రారంభమైంది. ఒక దశలో బీఎస్‌ఈలో(Nykaa share price BSE) ఈ షేరు ధర 89.24శాతం పెరిగి రూ.2,129 వరకు చేరింది. దీంతో సంస్థ మార్కెట్ విలువ రూ.లక్ష కోట్లు దాటింది. ప్రస్తుతం మధ్యాహ్నం 12 గంటల సమయంలో నైకా షేరు విలువ ఎన్‌ఎస్‌ఈలో రూ.2,104 వద్ద కొనసాగుతోంది.
ఇటీవల అక్టోబరు 28 నుంచి నవంబరు 1 మధ్య మూడు రోజుల పాటు జరిగిన నైకా ఐపీఓ(Nykaa IPO) సబ్‌స్క్రిప్షన్‌కు అనూహ్య స్పందన లభించిన విషయం తెలిసిందే. 2.7 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచగా.. 216.6 కోట్ల బిడ్లు (యాంకర్ ఇన్వెసర్లకు కేటాయించినవి కాకుండా) దాఖలయ్యాయని స్టాక్ ఎక్సేఛేంజీ డేటా ద్వారా వెల్లడైంది. అంటే సుమారు 81.8 రెట్లతో సమానం. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.5,352కోట్లను సమీకరించింది. బుధవారం(నవంబరు 10) స్టాక్ మార్కెట్లలోకి అడుగుపెడుతూనే అదరగొట్టింది.
మాజీ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ ఫల్గుణి నాయర్ నేతృత్వంలోని ఈ సంస్థ 2012లో ప్రారంభమైంది. ప్రస్తుతం బ్యూటీ ఉత్పత్తులకు ప్రధాన ఆన్‌లైన్ కేంద్రంగా మారింది. కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,440 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. పలు ప్రముఖ కంపెనీలకు చెందిన ఉత్పత్తులతో పాటు సొంతంగా బ్రాండ్లను కూడా నైకా విక్రయిస్తోంది. ఈ సంస్థ అమ్మకాల పోర్ట్‌ఫోలియోలో 1,500 వరకు బ్రాండ్‌లున్నాయి.
ఇదీ చూడండి:'మరో 50 ఏళ్లు.. భారత స్టాక్ మార్కెట్ల పరుగే'