కార్వీ స్టాక్ బ్రోకింగ్‌పై ఎన్‌ఎస్‌ఈ (నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా) కఠిన చర్యలు తీసుకుంది. ఈ స్టాక్ బ్రోకింగ్ సంస్థను 'ఎగవేతదారు' గా ప్రకటించటమే కాకుండా, దీనికి ఉన్న ఎన్‌ఎస్‌ఈ సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఎన్‌ఎస్‌ఈఐఎల్ నిబంధనల్లోని 4వ ఛాప్టర్ రూల్-1, 2 కింద సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు, 12వ ఛాప్టర్‌లోని ప్రొవిజన్ 1 (ఏ) కింద డిఫాల్టర్‌గా ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేస్తూ తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. ఈ నెల 23 తేదీ నుంచి ఈ చర్య అమల్లోకి వస్తుందని పేర్కొంది.
తన వినియోగదార్లకు చెందిన ఈక్విటీ షేర్లను సొంత ఖాతాలకు మళ్లించడం, వాటిని తనఖా పెట్టి బ్యాంకుల నుంచి కోట్ల రూపాయల అప్పు తీసుకోవటం, దాదాపు రూ.1,000 కోట్లకు పైగా సొమ్మును తన అనుబంధ సంస్థ అయిన కార్వీ రియాల్టీకి మళ్లించడం.. వంటి ఆరోపణలపై సరిగ్గా ఏడాది క్రితం కార్వీ స్టాక్ బ్రోకింగ్ సభ్యత్వాన్ని ఎన్‌ఎస్‌బీ, బీఎస్‌ఈ తాత్కాలికంగా రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ వినియోగదార్లకు, బ్యాంకులకు దాదాపు రూ.2,300 కోట్ల మేరకు బకాయి పడింది. ఏదో విధంగా నిధులు సేకరించి ఈ బాకీ తీర్చేస్తుందని ఏడాది కాలంగా స్టాక్ ఎక్స్ఛేంజీలు, సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా) ఎదురు చూశాయి. ఒక అనుబంధ కంపెనీలో మెజార్టీ వాటా విక్రయించే ప్రయత్నం చేస్తున్నట్లు, ఆ సొమ్ము రాగానే అన్ని చెల్లింపులు చేయగలమని కార్వీ స్టాక్ బ్రోకింగ్ యాజమాన్యం కొద్దికాలంగా ఎన్‌ఎస్‌ఈ-సెబీకి చెబుతున్నట్లు సమాచారం. కానీ ఏడాది గడిచినా అటువంటిదేమీ జరగలేదు. ఇక లాభం లేదని, తదుపరి చర్యలకు ఎన్‌ఎస్‌ఈ నడుం కట్టినట్లు తెలుస్తోంది.
ఫోరెన్సిక్ ఆడిట్‌కు బ్యాంకులు మొగ్గు?
ప్రస్తుత పరిస్థితిపై.. ఈ సంస్థకు దాదాపు రూ.1500 కోట్ల వరకు అప్పులు ఇచ్చిన బ్యాంకులు దృష్టి సారించినట్లు తెలిసింది. ఇప్పటికే కార్వీ స్టాక్‌బ్రోకింగ్ వ్యవహారాలపై 'ఫోరెన్సిక్ ఆడిట్' చేయించడానికి ఒక అగ్రశ్రేణి ఆడిట్ సంస్థకు బాధ్యతలను బ్యాంకర్లు అప్పగించినట్లు తెలిసింది. ఈ నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలకు బ్యాంకులు ముందడుగు వేయనున్నాయి.
కార్వీ స్టాక్‌బ్రోకింగ్ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఎన్‌ఎస్‌ఈ నిర్ణయం తీసుకున్న ఫలితంగా ఈ సంస్థ వినియోగదార్లు, వారికి ఉన్న బకాయిల పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. దీనిపై బీఎస్‌ఈ (బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్) మంగళవారం ఒక సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం కార్వీ స్టాక్ బ్రోకింగ్ వినియోగదార్లు ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ (ఐపీఎఫ్) కింద నష్టపరిహారాన్ని కోరొచ్చు. ఒక్కొక్కరికి రూ.15 లక్షల వరకు పరిహారం లభిస్తుంది. కార్వీ స్టాక్‌బ్రోకింగ్ నుంచి తమకు రావలసిన బకాయిల వివరాలు, అందుకు సంబంధించిన ఆధారాలతో ఎన్‌ఎస్‌ఈ సర్క్యులర్ జారీ అయిన తర్వాత 90 రోజుల్లో బీఎస్‌ఈ రీజినల్ ఇన్వెస్టర్ సెంటర్స్‌లో దరఖాస్తు చేసుకోవాలి. బీఎస్‌ఈ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్లోనూ తమ క్లెయిముల దరఖాస్తులు పంపొచ్చు.