వరుస నష్టాలకు చెక్ పెడుతూ దేశీయ సూచీలు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 767పాయింట్లు లాభపడి 60,687 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 229పాయింట్లు వృద్ధి చెంది 18,103కు చేరింది.
ఐటీ, రియాల్టీ, విద్యుత్ రంగ షేర్లు దూసుకెళ్లడం వల్ల నిఫ్టీ.. 18వేల మార్కును తిరిగి అందుకోగలిగింది.
ఇంట్రాడే సాగిందిలా...
అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలతో ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ.. కొద్దిసేపు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఆ వెంటనే బలంగా పుంజుకున్నాయి.
60,248 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్.. 59,997 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత బలపడి, మొత్తం మీద 767పాయింట్ల లాభంతో 60,687 వద్ద ముగిసింది.
17,977 వద్ద ప్రారంభమైన నిఫ్టీ.. 17,905 కనిష్ఠానికి చేరి అక్కడి నుంచి బలపడింది. చివరకు 229 పాయింట్లు వృద్ధి చెంది 18,103 వద్ద స్థిరపడింది.
లాభనష్టాలు...
- టెక్ఎమ్, హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్సర్వ్, ఎయిర్టెల్, ఏషియన్ పెయింట్స్, రిలయన్స్ షేర్లు లాభాలు గడించాయి.
- బజాజ్ ఆటో, టాటాస్టీల్, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాలు చవిచూశాయి.
సోమవారం లాభాలు గడించిన దేశీయ సూచీలు.. వరుసగా మూడు రోజులు నష్టపోయాయి. శుక్రవారం లాభాలతో వారాన్ని ముగించాయి.
ఇదీ చూడండి:-దేశ ఆర్థికానికి బలమైన బ్యాంకింగ్ వ్యవస్థ కీలకం: మోదీ