Multibagger stocks: కరోనా సంక్షోభం కారణంగా గత ఏడాది తీవ్రంగా పతనమైన స్టాక్ మార్కెట్లు ఈ సంవత్సరం భారీగా పుంజుకొన్నాయి. కొన్ని కంపెనీలు మదుపర్లకు మంచి లాభాల్ని తెచ్చి పెట్టాయి. గత ఆరు నెలల్లో అనేక కంపెనీలు మల్టీబ్యాగర్ స్టాక్స్(అనేక రెట్లు రాబడినిచ్చే స్టాక్స్)గా మారాయి. అందులో ఒకటి రఘువీర్ సింథటిక్స్. ఈ టెక్స్‌టైల్ కంపెనీ షేరు విలువ గత ఆరు నెలల్లో రూ.20 నుంచి రూ.600కు పెరిగింది. అంటే దాదాపు 30 రెట్ల రిటర్న్స్ ఇచ్చింది.
గతవారం రోజుల్లో ఈ స్టాక్ రూ.494 నుంచి రూ.600కు ఎగబాకింది. అంటే 21.5 శాతం రిటర్న్స్ ఇచ్చింది. పైగా ఈ వారంలో ప్రతి ట్రేడింగ్ సెషన్‌లో 5శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ఇక గత నెల వ్యవధిలో ఈ స్టాక్ విలువ రూ.216 నుంచి రూ.600కు పెరిగింది. అంటే 175 శాతం లాభాన్నిచ్చింది. అలాగే గత ఆరు నెలల వ్యవధిలో రూ.20 నుంచి రూ.600కు పెరిగి 2900 శాతం రాబడినిచ్చింది.
ఈ లెక్కన వారం క్రితం ఈ కంపెనీలో రూ.లక్ష పెట్టుబడిగా పెట్టి ఉంటే.. అది రూ.1.21లక్షలకు పెరిగి ఉండేది. ఒకవేళ నెల క్రితం ఇదే మొత్తంతో ఈ కంపెనీ స్టాక్స్ కొని ఉంటే అది ఇప్పటికి రూ.2.75 లక్షలకు ఎగబాకేది. అదే ఆరు నెలల క్రితం రూ.లక్ష విలువ చేసే రఘువీర్ సింథటిక్స్ షేర్లు కొని ఉంటే.. ఇప్పటికి రూ.30 లక్షలు ఆర్జించి ఉండేవారు.