సంప్రదాయాలు, ఆచారాలు, విశ్వాసాలకు భారత్ పెట్టింది పేరు. ఓ మంచి పని చేపట్టే ముందు ముహూర్తం (Muhurat Trading 2021) చూసుకొని ప్రారంభించడం ఇక్కడి ఓ ఆచారం. అయితే, పురాణాల్లో పేర్కొన్న ప్రతి విశ్వాసం, సంప్రదాయం వెనుక ఓ శాస్త్రీయ కారణమూ ఉందంటారు పెద్దలు. ఈ క్రమంలో చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకొనేదే దీపావళి. భారత్‌లోని చాలా మంది ఇన్వెస్టర్లు ఈ పండుగను ప్రత్యేకంగా చూస్తారు. ఈరోజు ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయం వరిస్తుందని నమ్ముతుంటారు. స్టాక్ మార్కెట్‌లో కూడా ఓ ఆనవాయితీ ఉంది. ఆ రోజున ప్రత్యేక సమయంలో 'మూరత్ ట్రేడింగ్'ను (Muhurat Trading 2021) నిర్వహిస్తుంటారు.
మూరత్ ట్రేడింగ్ అంటే..
స్టాక్ మార్కెట్‌లో దీపావళి పర్వదినం రోజు ట్రేడింగ్ చేస్తే.. వచ్చే దీపావళి వరకు లాభాల పంట పండుతుందన్నది (Muhurat Trading 2021) ఇన్వెస్టర్ల నమ్మకం. అందులో భాగంగానే స్టాక్ ఎక్స్ఛేంజీలు ఏటా దీపావళి రోజు ప్రత్యేకంగా మూరత్ ట్రేడింగ్‌ను నిర్వహిస్తాయి. ఇది ఒక గంట పాటు కొనసాగుతుంది. స్టాక్ ఎక్స్ఛేంజీలే సమయాన్ని నిర్ణయిస్తాయి. ఈ సమయంలో కనీసం ఒక్క స్టాక్ అయినా కొనాలని చాలామంది ట్రేడర్లు సెంటిమెంట్‌గా పెట్టుకుంటారు. ధనత్రయోదశి రోజు కనీసం ఒక గ్రాము బంగారమైనా కొనాలని ప్రజలు ఎలా ఆశపడతారో.. ఈ ట్రేడింగ్ కూడా అలాంటిదే. ఇక ఆ రోజు స్టాక్ బ్రోకింగ్ కార్యాలయాలన్నీ దీపకాంతుల్లో వెలిగిపోతుంటాయి.
ఈ సమయంలో ఏం జరుగుతుంది?
పరిమిత సమయం పాటు జరిగే ఈ ట్రేడింగ్‌ను (Muhurat Trading Timings 2021) కొన్ని భాగాలుగా విభజిస్తారు..
- బ్లాక్ డీల్ సెషన్ - రెండు పార్టీల మధ్య స్టాక్‌ను కొనుగోలు/విక్రయానికి సంబంధించి అంగీకారం కుదురుతుంది.
- ప్రీ-ఓపెన్ సెషన్ - స్టాక్ ఎక్స్ఛేంజీలు ఈక్విలిబ్రియం(సప్లై డిమాండ్‌ను సమతౌల్యం చేసే ధర)ను నిర్ణయిస్తాయి. ఈ సెషన్ సుమారు 8 నిమిషాలు ఉంటుంది.
- నార్మల్ మార్కెట్ సెషన్ - ఈ సమయంలో అసలు ట్రేడింగ్ జరుగుతుంది.
- కాల్ ఆక్షన్ సెషన్ - ఇల్లిక్విడ్(తేలిగ్గా అమ్ముడుపోని) సెక్యూరిటీల ట్రేడింగ్ జరుగుతంది.
- క్లోజింగ్ సెషన్ - ముగింపు ధర వద్ద మదుపర్లు మార్కెట్ ఆర్డర్‌ను పెడతారు.