తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎంత సంపాదిస్తున్నా మిగలట్లేదా? ఈ ట్రిక్స్​ ట్రై చేయండి! - స్టాక్స్​ ఇండియా

'మన భవిష్యత్తును మనం నిర్ణయించుకోలేం. కానీ, మన అలవాట్లు దాన్ని నిర్ణయిస్తాయి'... ఎఫ్‌.ఎం. అలెగ్జాండర్‌ చెప్పిన ఈ మాట ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిందే. ఆర్థిక విషయాల్లో దీనికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అయినప్పటికీ చాలామంది దీన్ని పెద్దగా పట్టించుకోరు. దీర్ఘకాలంలో సంపద సృష్టికి అవరోధం కల్పించే అలవాట్లను గుర్తించడం, వాటిని అధిగమించడం ఇక్కడ ఎంతో కీలకం.

MONEY SAVINGS
MONEY SAVINGS

By

Published : Jan 21, 2022, 12:47 PM IST

ఎవరో ఒకరు ఏదో చెప్పారని పెట్టుబడులు పెట్టేవారు ఎంతోమంది.. ప్రస్తుతం స్టాక్‌ మార్కెట్‌ బాగుందని మదుపు గురించి ఆలోచిస్తుంటారు. కానీ, అందులో ఎంతమేరకు అవగాహన ఉందో తెలుసుకోరు. మంచి ఆర్థిక అలవాట్లను అలవర్చుకునే క్రమంలో కొన్ని సవాళ్లు ఎదురయ్యే ఆస్కారం ఉంది. వాటిని అధిగమిస్తూ భవిష్యత్తుకు బాటలు వేసుకున్నవారే విజయవంతమైన మదుపరిగా మారతారు.

మీకోసం మీరు..

ఆర్జించిన మొత్తంలో మీ కోసం కొంత కేటాయించుకునే అలవాటు మీకుందా? లేకపోతే వెంటనే దీన్ని పాటించండి. ఆ తర్వాతే ఇతర ఖర్చులకు మీ సంపాదనను కేటాయించండి. ప్రతి నెలా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఇది ఎంత అన్నది మీ ఇష్టమే. చిన్న మొత్తంతో ప్రారంభించి, క్రమేపీ పెంచుతూ వెళ్లండి. కొన్నాళ్ల తర్వాత ఇదే మీకు కొండంత ఆర్థిక భరోసానిస్తుందని గుర్తుంచుకోండి.

అప్పులకు దూరంగా..

మన పరిమితిలో మనం జీవించాలి. ఎంత తక్కువ మొత్తం ఖర్చు చేస్తే అంత త్వరగా గొప్పవారవుతారు. ఒక వస్తువును మనం అప్పు చేసి కొంటున్నాం అంటే.. దానివల్ల భవిష్యత్తులో ఎంతోకొంత రాబడి రావాలి. లేదా దాని విలువ పెరగాలి. గృహరుణంలాంటివి దీనికి ఉదాహరణ. అంతేకానీ, తరుగుదల నమోదు చేసే వాటిని రుణాలతో తీసుకోవద్దు. కనీసం ఏడాదికోసారైనా మీ అప్పులను సమీక్షించుకోండి. అందులో వేటినైనా త్వరగా తీర్చేందుకు వీలుందా చూసుకోండి. తక్కువ వడ్డీ రేట్లు నడుస్తున్న కాలంలో కొత్త అప్పులు తీసుకోవడానికి ఆసక్తిగానే కనిపిస్తోంది. కానీ, వడ్డీ రేట్లు క్రమంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇలాంటప్పుడు చేసిన అప్పులు భారం అవుతాయి.

మదుపు.. వైవిధ్యంగా

వైవిధ్యం.. పెట్టుబడులు ఎప్పుడూ ఒకే పథకంలో పెట్టకూడదు. నష్టభయం పరిమితిని పాటిస్తూ.. పలు మార్గాల్లో మదుపు కొనసాగించాలి. అధిక రాబడి కోసం ఒకే చోట మొత్తం డబ్బును పెట్టినప్పుడు, కొన్నిసార్లు ఇబ్బందులు తప్పకపోవచ్చు. అందుకే, పెట్టుబడి పథకాలు ఎంచుకునేటప్పుడు నష్టభయం, ఖర్చులు, పన్నులు ఇలా అన్నింటినీ లెక్కలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాలి. ఉదాహరణకు.. ఈక్విటీల్లో మదుపు చేయాలనుకున్నప్పుడు.. వివిధ రంగాలు, మార్కెట్‌ క్యాప్‌ ఆధారంగా వైవిధ్యం పాటించాలి. ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకునేలా పోర్ట్‌ఫోలియోను నిర్మించుకోవాలి.

ఖర్చులపై నియంత్రణ..

వాస్తవం చెప్పాలంటే.. ఒకప్పటితో పోలిస్తే.. ఇప్పుడు మన ఆదాయం.. కొనుగోళ్లకు సమన్వయం సాధించడం కష్టమవుతోంది. ఖర్చే చేయకుండా బతకడమూ సాధ్యం కాదు. పెరుగుతున్న ఆదాయంతో పాటే మన జీవన శైలిలోనూ మార్పులు సహజం. ఆదాయం పెరిగినప్పుడు పొదుపు పెంచుకోవడమే ఆర్థిక విజయ రహస్యం. అత్యవసరాలు, విలాసాల మధ్య తేడాను స్పష్టంగా గుర్తించాలి. సమాజం గుర్తింపు కోసం ఆర్థిక ఒత్తిడికి గురికావద్దు. ఒకటి కొన్నామంటే అది మనకు ఎంత మేరకు ఉపయోగపడుతుందో అంచనా వేసుకోవాలి. అనుకున్న వెంటనే కాకుండా.. కాస్త వాయిదా వేసే అలవాటూ మంచిదే.

ఆర్థిక విషయాల్లో మన కుటుంబానికి మించి నమ్మే వ్యక్తులు వేరే ఎవరూ ఉండరు. మన బలాలు, బలహీనతలు వారికే తెలుసు. అందుకే, ఒక ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో చర్చించడం మంచి అలవాటు. మీరు నమ్మే మిత్రులు, ఆర్థిక నిపుణుల సలహాలు వాటికి కాస్త బలం చేకూర్చేందుకే అని మర్చిపోవద్దు. పైన చెప్పిన అలవాట్లు మనం పాటించడం చూడ్డానికి సాధారణంగానే కనిపిస్తాయి. కానీ, వాటిని ఆచరించేందుకు వ్యక్తిగత ఆర్థిక క్రమశిక్షణ ఎంతో అవసరం. మీ ప్రణాళికలపై నమ్మకమే మీరు ఉన్నత స్థాయికి చేరుకునేందుకు మార్గాన్ని చూపిస్తుంది.

- అజిత్‌ మేనన్‌, సీఈఓ, పీజీఐఎం ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:Mutual Funds: ఒక్క క్లిక్​తో.. పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారా?

ABOUT THE AUTHOR

...view details