LIC Public Issue: భారతీయ జీవిత బీమా సంస్థ పబ్లిక్ ఇష్యూ కోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మార్కెట్ నియంత్రణా సంస్థ (సెబీ) అనుమతి కోసం సమర్పించాల్సిన ప్రాథమిక పత్రాల రూపకల్పనలో నిమగ్నమైనట్లు 'పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ' విభాగం కార్యదర్శి తుహిన్ కాంత పాండే శనివారం తెలిపారు.
ఫిబ్రవరి మొదటి వారంలో సెబీకి సమర్పించబోయే ఈ పత్రాల్లో ఎలాంటి లోపాలు లేకుండా ఉండేందుకు జాగ్రత్తపడుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు సెబీతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఒకసారి పత్రాలు అందజేసిన తర్వాత సెబీ నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. దీంతో ఐపీఓ ప్రక్రియ మరింత వేగవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎల్‌ఐసీ భారీ ఐపీఓ మార్చి ప్రారంభంలో ఉండే అవకాశం ఉందని తుహిన్ కాంత పాండే ఇటీవల తెలిపారు. భారత్‌లో అతిపెద్ద ఐపీఓగా ఎల్‌ఐసీ చరిత్ర సృష్టించనుంది. ఎల్‌ఐసీలో వాటా విక్రయం ద్వారా రూ.లక్ష కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు దేశ చరిత్రలో అతిపెద్ద ఐపీఓ అయిన పేటీఎం సమీకరించిన రూ.18,300 కోట్లకు ఇది అయిదు రెట్లు అధికం కావడం గమనార్హం. 2021లో భారీ ఎత్తున ఐపీఓలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ ఏడాది సగటున ఐపీఓల అనుమతికి సెబీ 77 రోజులు తీసుకుంది. మాక్రోటెక్ డెవలపర్స్, సెవెన్ ఐలాండ్స్ షిప్పింగ్ వంటి సంస్థలైతే 35 రోజుల్లోనే అనుమతి పొందాయి. ఈ నేపథ్యంలో ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూకు సైతం గరిష్ఠంగా 35-40 రోజులు పట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.