తెలంగాణ

telangana

ETV Bharat / business

IPOs in 2021: ఐపీఓల జోరు.. పెట్టుబడిదారుల హుషారు! - ఐపీఓ అంటే ఏంటీ

IPO stocks India: దేశ వ్యాపార రంగంలో ఈ ఏడాది ఐపీఓల హవా నడుస్తోంది. షేర్‌ మార్కెట్‌ మీద ఆసక్తి ఉన్న ఔత్సాహిక యువత ఏ ఇద్దరు కలిసినా 'ఐపీఓ' మాటలే విన్పిస్తున్నాయి. అసలు ఏంటీ ఐపీఓ? షేర్లు కొనాలనుకున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన అంశాలేమిటి? ఐపీఓ వల్ల కంపెనీకి, కొనేవారికి లాభం ఏంటి? అన్న విషయాలపై సమగ్ర కథనం.

ipo boom in india
ipo boom in india

By

Published : Dec 5, 2021, 8:25 AM IST

IPO boom in India: భారతీయ వ్యాపారరంగం ఈ ఏడాది మంచి జోరుమీద ఉంది. ఒక పక్కన పెరుగుతున్న యూనికార్న్‌ కంపెనీల హవా... మరోపక్కన వారానికో కంపెనీ చొప్పున ఐపీఓల హంగామా... దాంతో చేతిలో నాలుగు డబ్బులున్నవాళ్లంతా ఏ షేర్లు కొనాలా అని ఆరాలు తీస్తున్నారు. ఈ ఏడాది నూటపాతికకి పైగా కంపెనీలు ఐపీఓకి అనుమతి కోరుతూ 'సెబీ'లో నమోదు చేసుకోగా అవన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్టవుతున్న నేపథ్యంలో భారతదేశానికి ఇది ఐపీఓల సంవత్సరంగా మారింది.

.

'జొమాటో కొందామనుకున్నా... ఆఫీసులో బిజీగా ఉండి మిస్సయ్యా. లోకల్‌ కంపెనీలు కదా, కిమ్స్‌ కానీ విజయా డయాగ్నస్టిక్స్‌ కానీ కొని ఉండాల్సింది, ఎందుకో నిర్లక్ష్యం చేశా. సరే అని ఓపిగ్గా నైకాకి అప్లై చేశానా, అది అలాట్‌ అవలేదు. పేటీఎం ఉంది కదా అనుకుంటే మొదటిరోజే అది గాలి తీసేసింది. దేనికైనా అదృష్టం ఉండాలి...'

'నిజమే... మా తమ్ముడు ఆరేళ్లయింది ఉద్యోగంలో చేరి. అప్పుడు ఎంత గుంజాటన పడ్డాడో ఉద్యోగంలో చేరాలా, అమెరికా వెళ్లి ఎంఎస్‌ చేయాలా... అని. ఉద్యోగంలో చేరమన్నందుకు చాలా రోజులు అసంతృప్తిగానే ఉన్నాడు. షేర్లు ఆశ పెట్టి పగలూ రాత్రీ పని చేయించుకుంటున్నారని తన సహోద్యోగులందరూ బాధపడేవారట. మొన్న వాళ్ల కంపెనీ యూఎస్‌లో లిస్టయింది. తెల్లారేసరికల్లా కంపెనీలో ఐదొందల మంది కోటీశ్వరులైపోయారు. అదృష్టమంటే అది కదా’ ‘అదృష్టం అని కాదు కానీ, కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుని ఐపీఓ సమయంలో జాగ్రత్తగా పెట్టుబడి పెడితే నష్టపోయే పరిస్థితి రాదనిపిస్తుంది. మనకి తెలిసిన, పేరున్న కంపెనీలనే నమ్ముతున్నాం కానీ ఐపీఓకి వస్తున్న మిగతా కంపెనీలనీ ఒకసారి చూడాలి. రైల్‌టెల్‌, పవర్‌గ్రిడ్‌ లాంటి కంపెనీలు కూడా వచ్చాయి ఈ ఏడాది. కాస్త నికరంగా పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిదనుకుంటున్నా...'

షేర్‌ మార్కెట్‌ మీద ఆసక్తి ఉన్న ఔత్సాహిక యువత ఏ ఇద్దరు కలిసినా దాదాపుగా ఇలాంటి మాటలే విన్పిస్తున్నాయి. ఈ సంవత్సరం ఒక పక్కన కొవిడ్‌ భయం వెంటాడుతూనే ఉన్నా మరోపక్క స్టాక్‌ మార్కెట్‌ రికార్డుల మీద రికార్డులు నమోదుచేసింది. సెన్సెక్స్‌ ఒక దశలో 60వేల మార్కు దాటి గతేడాది కన్నా 40 శాతం పైన ట్రేడ్‌ అయింది. దాదాపు ఏడాదిన్నరగా మార్కెట్‌ వాతావరణం ఆశాజనకంగా ఉండటంతో ఐపీఓలకు ఇది సరైన సమయంగా భావించాయి కంపెనీలు. దాంతో ఏడాది పొడుగునా ఐపీఓలు వరస కట్టి వార్తల్లో నిలిచాయి. చాలావరకూ అనుకున్న దానికన్నా ఎక్కువగానే డబ్బు సంపాదించాయి.

.

జనవరిలో ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, హోమ్‌ ఫస్ట్‌ ఫైనాన్స్‌, ఇండిగో పెయింట్స్‌ లాంటి కంపెనీలతో మొదలుపెట్టి నవంబరులో పాలసీ బజార్‌, గోకలర్స్‌, పేటీఎంల వరకూ వందకు పైగా కంపెనీలు ఐపీఓకి వెళ్లాయి. లక్ష కోట్లకు పైనే సేకరించాయి. గత ఇరవై ఏళ్లలో ఈ స్థాయిలో ఐపీఓలు ప్రకటించడం ఇదే మొదటిసారి.

Reason for IPO boom India

కొంతకాలంగా ప్రభుత్వం అంకుర పరిశ్రమలకు ప్రోత్సాహాన్నిస్తున్న నేపథ్యంలో అవి వ్యాపారాలను విస్తరించి స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్టవడానికి వీలు కల్పిస్తూ సెబీ(సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా) కూడా ఐపీఓ నిబంధనల్ని సులభతరం చేసింది. దాంతో చాలా సంస్థలు ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాయి. సహజంగానే ఈ పరిస్థితులు సాధారణ ప్రజల దృష్టినీ షేర్ల వైపు మళ్లించాయి. సాఫ్ట్‌వేర్‌ తదితర రంగాల్లో ఆదాయాలు పెరగడం, ఇంటర్నెట్‌ అందుబాటులో ఉండడం, ఇంతకు ముందులాగా కాకుండా డీమ్యాట్‌ అకౌంట్లతో సులభంగా ట్రేడింగ్‌ చేసే అవకాశం ఉండడం... అన్నీ కలిసి ఐపీఓని జనసామాన్యంలోకి తెచ్చాయి.

.

IPO in telugu

స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నిత్యం జరిగే ట్రేడింగ్‌ని సెకండరీ మార్కెట్‌ అంటారు. కంపెనీతో సంబంధం లేకుండా దాని షేర్లను మరొకరి దగ్గర నుంచి కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. అలా కాకుండా కంపెనీకి చెందిన కొన్ని వాటాలను నేరుగా కొనడానికి వీలు కల్పించేది ఐపీఓ. కంపెనీ తొలిసారి వాటాలను మామూలు ప్రజలకు అమ్మడం కాబట్టి 'ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌' అనీ, దాన్ని ప్రైమరీ మార్కెట్‌ అనీ అంటారు. సాధారణంగా ఒక కంపెనీ పెట్టాలనుకున్నప్పుడు కొందరు సొంతంగా నిధులు సమకూర్చుకుంటారు. కొంతమంది సన్నిహితుల దగ్గర అప్పు తీసుకుంటారు. అవసరమైతే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటారు. అలా ప్రారంభమైన సంస్థ బాగా పని చేస్తున్నప్పటికీ లాభాలు రావడానికి సమయం పట్టొచ్చు. వచ్చిన లాభాలు సంస్థ నిర్వహణకి సరిపోకపోవచ్చు. లేదా కంపెనీని ఇంకా పెద్దగా ఇతర రంగాలకో, నగరాలకో విస్తరించాలనుకోవచ్చు, లేకపోతే వస్తున్న లాభాలన్నీ బ్యాంకు లోనుపై వడ్డీలు కట్టడానికే సరిపోతున్నాయి కాబట్టి ముందు ఆ లోన్లని వదిలించుకోవాలను కోవచ్చు... అటువంటప్పుడు అవసరమైన డబ్బుని ప్రజల నుంచి పెట్టుబడిగా తీసుకునే అవకాశాన్ని ఇస్తుంది ఐపీఓ.

How to invest in IPOs

ఐపీఓకి రావాలనుకున్న కంపెనీ ముందుగానే ఆ వివరాలను ప్రకటిస్తుంది. ప్రజలకు ఆఫర్‌ చేస్తున్న వాటా విలువ(షేర్‌ ప్రైస్‌) ఎంత ఉండబోతోంది, ఇష్యూ ఓపెనింగ్‌- క్లోజింగ్‌ తేదీలు, మార్కెట్‌ లాట్‌ ఎంత(కనీస పెట్టుబడి పరిమితి రూ.10-15 వేల మధ్య ఉంటుంది. షేరు ధరని బట్టి ఆ మొత్తంలో ఎన్ని షేర్లు వస్తే అన్నిటిని మార్కెట్‌ లాట్‌గా నిర్ణయిస్తారు)... లాంటి విషయాలన్నీ ముందే చెబుతుంది. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే- మన దగ్గర కొనడానికి డబ్బున్నా, ఐదు వందలో వెయ్యో షేర్లు కొనాలని దరఖాస్తు చేసినా అవన్నీ మనకి తప్పనిసరిగా వస్తాయన్న గ్యారంటీ లేదు. డిమాండ్‌ ఎక్కువగా ఉంటే మనం కొనాలనుకున్నన్ని షేర్లు ఇవ్వకుండా తగ్గించి ఇస్తారు. దరఖాస్తు చేసిన వాళ్లందరికీ షేర్లు ఇవ్వడం కూడా సాధ్యం కాదు కాబట్టి కంప్యూటరైజ్డ్‌ లాటరీ ద్వారా కొందరికి అలాట్‌ చేస్తారు. అలాట్‌మెంట్‌ పూర్తయ్యాక కంపెనీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో లిస్టవుతుంది. అప్పుడు ఎవరైనా వాటిని కొనడం, అమ్మడం చేయవచ్చు.

.

Which IPOs to buy

షేర్లు కొనాలనుకున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన అంశాలేమిటంటే...

చరిత్ర: కంపెనీ వివరాలను సేకరించాలి. అది ఏం కంపెనీ, పెట్టి ఎన్నాళ్లయింది, అది చేసే వ్యాపారమైనా, అందించే సేవలైనా ఎవరికి ఉపయోగపడతాయి, భవిష్యత్తులో వాటికి డిమాండ్‌ ఉంటుందా, ఆ రంగంలో పోటీ ఎలా ఉందీ, కంపెనీ యాజమాన్యం నమ్మదగినదేనా...ఇలాంటి వివరాలన్నీ తెలుసుకోవాలి.

మార్కెట్‌:కంపెనీ ఎంత బాగున్నా అది ఐపీఓకి వచ్చిన సమయంలో స్టాక్‌మార్కెట్‌ పరిస్థితి బాగోలేకపోతే అప్పుడు వచ్చే ఐపీఓలకు దూరంగానే ఉండాలి.

షేర్‌ ధర:ఐపీఓలో షేర్లను నేరుగా కంపెనీ నుంచి కొంటాం కాబట్టి వాటి విలువని కంపెనీనే నిర్ణయిస్తుంది. సంస్థ నెట్‌వర్త్‌ని బట్టి షేరు విలువని నిర్ధారిస్తారు. ఐపీఓ ప్రాసెస్‌ మొదలవగానే పత్రికల్లో సమీక్షలూ విశ్లేషణలూ వస్తాయి. వాటిని చదివి
అర్థం చేసుకోవాలి. అనధికార మార్కెట్‌లో ఆ షేర్‌ ఎంత పలుకుతోందో కూడా ఉజ్జాయింపుగా తెలుస్తుంది. దాన్ని బట్టి కొనాలా వద్దా అన్న నిర్ణయం తీసుకోవచ్చు.

షేర్లు కొన్నాక కంపెనీ ఎత్తేస్తే..?

అలా జరగకుండా చూడడానికే 'సెబీ' ఉంది. ఏ కంపెనీ అయినా ఐపీఓకి వెళ్లడానికి ముందుగా సెబీ అనుమతి తీసుకోవాలి. కంపెనీ నిజమైనదా కాదా, దాని ఆర్థిక, వ్యాపార స్థితిగతులేమిటీ.. లాంటివన్నీ పరిశీలించాకే ఐపీఓకి అనుమతి ఇస్తుంది. సెబీ లేకపోతే ఫేక్‌ కంపెనీలు ఐపీఓ పేరుతో ప్రజల్ని మోసం చేసే ప్రమాదం ఉంది. అందుకని ఈ ఏర్పాటు చేశారు. పైగా సెబీ అనుమతి పత్రం(దీన్నే ప్రాస్పెక్టస్‌ అంటారు)లో కంపెనీ గురించి చాలా వివరాలు ఉంటాయి. రిస్క్‌ ఫ్యాక్టర్స్‌ ఏమిటో కూడా చెబుతారు. అంటే- ఎంత పెద్ద కంపెనీ ఐపీఓ అయినా అనుకూల, ప్రతికూల అంశాలన్నిటినీ ఇన్వెస్టర్లు బేరీజు వేసుకోవడానికి కావలసిన సమాచారం అందులో ఉంటుంది. అదంతా చదివాకే నిర్ణయం తీసుకోవచ్చు.

షేర్లు ఎవరైనా కొనవచ్చా?

ఏదైనా బ్రోకింగ్‌ సంస్థ సాయంతో డీమ్యాట్‌ ఖాతా తీసుకుంటే చాలు, ఎవరైనా కొనుక్కోవచ్చు. అయితే కొనేవాళ్లలో ముఖ్యంగా నాలుగు రకాల వాళ్లుంటారు.

రిటైల్‌ ఇన్వెస్టర్లు: రెండు లక్షలు, అంతకన్నా తక్కువ మొత్తం పెట్టుబడి పెట్టే సాధారణ పౌరులు. స్టాక్‌ బ్రోకింగ్‌ కంపెనీల ద్వారా ఐపీఓలో ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు రెండు లక్షలు మాత్రమే పెట్టుబడి పెట్టవచ్చు. మామూలు షేర్స్‌కి ఆ పరిమితి ఉండదు.

నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్స్‌:రెండు లక్షలకన్నా ఎక్కువ పెట్టుబడి పెట్టగలవాళ్లు. వీళ్లు ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ఖాతా ద్వారా పెట్టుబడి పెట్టాలి. గరిష్ఠ పరిమితి ఉండదు.

క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్స్‌:బ్యాంకులూ, బీమా సంస్థలూ, మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీలూ లాంటివి. వీరికి స్టాక్‌మార్కెట్‌ మీద మంచి అవగాహన ఉంటుంది. మనం ఈ కంపెనీల్లో డబ్బులు పెడితే వాళ్లు మన తరఫున ఇన్వెస్ట్‌ చేస్తారు. పది కోట్ల కన్నా ఎక్కువ పెట్టుబడి పెట్టినవారిని యాంకర్‌ ఇన్వెస్టర్లు అంటారు.

సిబ్బంది:ఐపీఓ ఆఫర్‌ చేస్తున్న కంపెనీలో పనిచేస్తున్న సిబ్బంది కూడా తమ కంపెనీ ఐపీఓలో పెట్టుబడి పెట్టవచ్చు. అమ్మకానికి ఉన్న వాటాల్లో ఈ నాలుగు రకాల పెట్టుబడిదారుల్లో ఒక్కొక్కరికీ ఒక్కో శాతం చొప్పున షేర్లను రిజర్వ్‌ చేసి పెడతారు. మరో ముఖ్య విషయం- రిటైల్‌ ఇన్వెస్టర్లు, సిబ్బంది కాకుండా మిగతా రెండు కేటగిరీల వారికీ పబ్లిక్‌ ఇష్యూ కన్నా ఒకరోజు ముందే షేర్‌ అలాట్‌మెంట్‌ జరుగుతుంది కాబట్టి అక్కడ డిమాండ్‌ని గమనించి కూడా రిటైల్‌ ఇన్వెస్టర్లు నిర్ణయం తీసుకోవచ్చు.

ఐపీఓ వల్ల కంపెనీకి ఏమిటి లాభం?

ఐపీఓ వల్ల కంపెనీకి వడ్డీలేకుండా డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు, అప్పులు తీర్చుకోవచ్చు. కొత్త రంగాల్లో పెట్టుబడి పెట్టవచ్చు. ఐపీఓ గురించి అందరూ చర్చించుకోవడం వల్ల కంపెనీకి బాగా పబ్లిసిటీ వస్తుంది. బ్రాండ్‌ వాల్యూ పెరుగుతుంది. అప్పటివరకూ కంపెనీలో భాగస్వాములుగా ఉన్నవారికి ఐపీఓ వల్ల మంచి రిటర్న్స్‌ వస్తాయి.

కొనేవారికి..?

మంచి కంపెనీ, బాగా వృద్ధి చెందగల దనుకున్న కంపెనీలో పెట్టుబడి పెట్టే అవకాశం, తక్కువ ధరకే షేర్లు కొనే అవకాశం ఐపీఓ ద్వారానే వస్తుంది. లిస్టయిన తర్వాత మళ్లీ అంత తక్కువ ధరకి షేర్లు రావు. లిస్టయిన కొద్ది రోజులకే షేర్‌ విలువ పెరిగితే లాభానికి అమ్ముకోవచ్చు. అలా కాకుండా పెట్టుబడిగా భావించి అలాగే ఉంచేసినా పెరిగినప్పుడు అమ్మి ఆర్థిక అవసరాలు తీర్చు కోవచ్చు. వేర్వేరు రకాల కంపెనీలు ఐపీఓకి వస్తాయి కాబట్టి మనకి అవగాహన ఉన్న రంగంలో పనిచేస్తున్న కంపెనీ షేర్లను ఎంచుకునే వీలుంటుంది. స్వల్పకాలంలో ప్రతిఫలం ఆశిస్తున్నామా, దీర్ఘకాలం పెట్టుబడిగా పెడదామనుకుంటున్నామా... అన్నదాన్ని బట్టి కంపెనీలను ఎంచుకోవాలి. రిస్క్‌ ఉన్నా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటే లాభమూ ఎక్కువ ఉంటుంది. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లు ఎంత పెట్టుబడి పెట్టినవాళ్లకి అంత ప్రతిఫలం లభిస్తుంది. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలకి చెందిన ఒక్కో షేర్‌ విలువ వేలల్లో ఉంది. అవన్నీ ఒకప్పుడు పదీ ఇరవై రూపాయల నుంచీ మొదలైనవే. ఉదాహరణకి ఇన్ఫోసిస్‌ షేర్‌ విలువ ఇప్పుడు రూ.1700పైన ఉంది. 1993లో ఆ సంస్థ ఐపీఓకి వెళ్లినప్పుడు అది 95 రూపాయలే. అప్పుడు రూ.9500 పెట్టి వంద షేర్లు కొని అలాగే ఉంచుకుంటే ఈ మధ్యలో కంపెనీ ఇచ్చిన బోనసులూ డివిడెండ్లూ లాంటివన్నీ కలిపి వాటి విలువ ఇప్పటికి రూ.18 కోట్లు అయ్యేదట.

నష్టాలే ఉండవా?

ఉండవని కాదు. సరైన సంస్థని ఎంచుకోకపోయినా, ఐపీఓ లిస్టింగ్‌ తర్వాత ఒక్కసారిగా షేర్‌ ధర పడిపోయినా ఆ నష్టాన్ని భరించాల్సిందే. అందుకే పెట్టుబడి పెట్టేటప్పుడే ముందూ వెనకా అన్నీ తెలుసుకుని పెట్టాలి. ఐపీఓలో ఎంత డబ్బు సేకరించాలనుకున్నదీ కంపెనీలు చెబుతాయి. అది పూర్తిగా కంపెనీ విస్తరణకేనా కాదా తెలుసుకోవాలి. కొన్నిసార్లు అప్పటివరకూ ఉన్న ప్రమోటర్లు తమ వాటాలు అమ్ముకుంటారు. అలా ఎక్కువ వాటాలు అమ్ముతున్నట్లయితే దాని గురించి ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. అలాగే టెక్‌ కంపెనీలు అనీ, ఫైనాన్స్‌ కంపెనీలు అనీ ఒకే రంగానికి చెందిన కంపెనీలను ఒకే గాటన కట్టి ఒక కంపెనీ విజయవంతమైంది కాబట్టి ఇంకోటీ అవుతుందని అనుకోకూడదు. ఏ కంపెనీకి ఆ కంపెనీనే విడివిడిగా చూడాలి. వాటి బిజినెస్‌ మోడల్‌ ఏమిటో తెలుసుకుని ముందుకెళ్లాలి.

నిజానికి స్టాక్‌ మార్కెట్లపైన మనకి అవగాహన కన్నా అపోహలు ఎక్కువ అంటారు నిపుణులు. వ్యాపార పారిశ్రామిక రంగాల్లో ఎంతో ముందున్నప్పటికీ తెలుగువారు స్టాక్‌ మార్కెట్‌ అనగానే అదొక జూదం అని అభిప్రాయపడి దూరంగా ఉండిపోతున్నారు తప్ప అవకాశాలను అందిపుచ్చుకుని లబ్ధి పొందడం లేదని చెబుతున్నారు. సాంకేతికత పెరగడం వలన ఇందులో అవకతవకలూ అక్రమాలూ తగ్గాయనీ, భద్రత పెరిగిందనీ వారు చెబుతున్నారు.

అత్యాశకు పోవడం, శక్తికి మించి అప్పులు చేసి షేర్లు కొనడం, మొత్తం డబ్బును ఒకేచోట పెట్టుబడి పెట్టడం... ఈ మూడు తప్పులూ చేయకుండా మార్కెట్‌ మీద అవగాహన పెంచుకుని, ఆచితూచి నిర్ణయం తీసుకుంటూ, ఉన్న డబ్బులో కొంత మాత్రమే ఇందులో పెట్టుబడి పెడుతూ ఒక్కో అడుగూ వేయగలిగితే... ఐపీఓలు అద్భుతమైన అవకాశాలవుతాయట..!

ఆ రెండూ....

ఈ ఏడాది వచ్చిన ఐపీఓల్లో ఎక్కువ చర్చనీయాంశమైనవి- నైకా, పేటీఎంలు. ఈ రెండు సంస్థల వివరాలను విశ్లేషించి చూస్తే ఐపీఓ విజయాన్ని ప్రభావితం చేసే అంశాలేమిటో తెలుసుకోవచ్చు. నైకా ఐపీఓకి వచ్చేనాటికే లాభాల్లో ఉంది. సౌందర్య ఉత్పత్తుల తయారీతో ఆధునిక యువతరానికి దగ్గరైన కంపెనీ. ఒకే రంగంలో ఫోకస్డ్‌గా పనిచేస్తోంది. భవిష్యత్తులో విస్తరించడానికి చాలా అవకాశమున్న రంగం కాబట్టి సంస్థ ఎదుగుదలకి ఛాన్స్‌ ఉంది. అందుకే దానికి అంత డిమాండ్‌ వచ్చి ఏకంగా 82 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్‌ అయింది. లిస్టయిన కొద్దిరోజులకే షేర్‌ ధర దాదాపు రెట్టింపైంది. అదే పేటీఎం విషయానికి వస్తే సంస్థ నష్టాల్లో ఉంది. నిజానికి డిజిటల్‌ పేమెంట్స్‌ రంగంలో మొదట వచ్చిన కంపెనీగా దీనికి మంచి అవకాశాలు ఉన్నప్పటికీ వేర్వేరు రంగాల్లోకి విస్తరించడం వల్ల ఫోకస్‌ లేకుండా అయిపోవడమే కాదు, ఏ లావాదేవీలు నిర్వహించాలన్నా అన్ని రంగాలకు చెందిన నిబంధనలనూ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. బలమైన విభాగం అని చెప్పుకోడానికి ఒక్కటీ లేదు. చైనా కంపెనీలు ఇందులో పెట్టుబడి పెట్టడం వల్ల విస్తరించడానికి నిబంధనలు అడ్డు రావచ్చు. విశ్లేషకుల అంచనా ప్రకారం షేరు ధర రూ.1200 సరిపోయేది. కానీ సంస్థ రూ.2150 పెట్టింది. దాంతో అతి కష్టమ్మీద 1.8 రెట్లు మాత్రమే సబ్‌స్క్రైబ్‌ అయింది. నిజానికి నైకా కన్నా పేటీఎం గురించే అందరూ ఎక్కువగా ఎదురుచూశారు.

విజయ్‌ చెప్పే వెదురు కథ!

కేవలం డిగ్రీ చదివి ఎన్నో లిస్టెడ్‌ కంపెనీల్లో భాగస్వామిగా, పెట్టుబడిదారుగా మంచి పేరు తెచ్చుకున్న విజయ్‌ కేడియా పందొమ్మిదో ఏట నుంచి వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నాడు. ఐఐఎంలలో విద్యార్థులకు పాఠాలు చెబుతూ అతడో కథ చెబుతాడు. అదేంటంటే- మిగతా అన్ని మొక్కల్లాగే చైనా వెదురు(చైనీస్‌ బాంబూ)కీ మట్టీ నీరూ వెలుతురూ కావాలి. అయినా నాటిన మూడు నాలుగేళ్ల దాకా అది ఎదుగూ బొదుగూ లేకుండా విసుగు తెప్పిస్తుంది. దీన్ని నాటి తప్పుచేశామా, తీసేసి ఇంకోటి పెట్టుకుందామా అన్న సందిగ్ధావస్థలోకి నెట్టేస్తుంది. సహనం నశించినవారు పీకి పడేస్తారు కూడా. నాలుగేళ్లూ దాటి ఐదో ఏడు రాగానే అదే మొక్క ఆరే ఆరు వారాల్లో ఎనభై అడుగుల పొడుగు పెరిగిపోతుంది. చూడటానికి అదో అద్భుతంలా అన్పిస్తుంది కానీ నిజానికి ఏం జరిగిందంటే- అంత పొడుగు పెరగడానికీ ఆ తర్వాత కొన్ని దశాబ్దాల పాటు బతకడానికీ అవసరమైన బలమైన పునాదిని వేసుకోవడానికి లోలోపల వేళ్లను విస్తరించుకుంటూ మొదటి నాలుగేళ్లనూ గడుపుతుంది. ఆ నాలుగేళ్లూ ఓపిక పట్టినవారే పెరిగిన చెట్టువల్ల లబ్ధి పొందగలుగుతారు. అదే పెట్టుబడులకూ వర్తిస్తుంది. సరైన సంస్థల్లో పెట్టుబడి పెట్టి ఓపిగ్గా నిరీక్షించినవారికే లాభాలూ ఉంటాయి... అని చెబుతాడు కేడియా. ఎవరికీ తెలియని, ఎవరూ వినని స్టాక్స్‌ని వెతికి పట్టుకుని పెట్టుబడులు పెట్టడంలో దిట్ట అతడు. స్వల్పవ్యవధి పెట్టుబడుల జోలికి అసలు వెళ్లడు.

ఇదీ చదవండి:డిసెంబర్​లో 10 ఐపీఓలు.. రూ.10,000 కోట్ల లక్ష్యం!

ABOUT THE AUTHOR

...view details