ద్రవ్యోల్బణం లెక్కలు, అంతర్జాతీయ పరిణామాలు ఈ వారం స్టాక్ మార్కెట్లను (Stock market) ప్రభావితం చేయనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి మార్కెట్ సెంటిమెంట్ పాజిటివ్‌గా (Market Outlook) ఉందని చెబుతున్నారు. ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటున్నట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తుండటం.. ఇందుకు కారణమని అంటున్నారు. అయితే సూచీలు రికార్డు స్థాయిలకు చేరినప్పుడు లాభాల స్వీకరణ వల్ల కొంత ఒడుదొడుకులు ఎదుర్కోవచ్చని అంచనా వేస్తున్నారు.
అంతర్జాతీయంగా చూస్తే ఈ వారం.. చైనా పారిశ్రామికోత్పత్తి, అమెరికా ద్రవ్యోల్బణం గణాంకాలతో పాటు.. దేశీయంగా ఆగస్టు నెలకు సంబంధించి టోకు ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) లెక్కలు విడుదల కానున్నాయి. ఇవన్నీ మార్కెట్లను ప్రభావితం చేయొచ్చని స్వస్తిక్ ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ పరిశోధనా విభాగాధిపతి సంతోశ్ మీనా పేర్కొన్నారు.