బంగారం ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేస్తూ దూసుకెళ్లాయి. 10గ్రాముల(24క్యారెట్లు) పసిడి రూ.35వేలకు పైగా ధర పలుకుతోంది. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ భయాలు సహా మరిన్ని అంతర్జాతీయ పరిణామాలు, దేశీయంగా పెరిగిన కొనుగోళ్లు పసిడి ధరల పరుగులకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇలానే కొనసాగితే త్వరలోనే 10గ్రాముల(24క్యారెట్ల) బంగారం రూ.40వేలకు చేరుకునేందుకు మరెంతో కాలం పట్టదని అంచనా వేస్తున్నారు.
"ఇటీవల బంగారం ధర దాదాపు 8శాతం మేర పెరిగింది. 10గ్రాములు రూ.33వేల నుంచి రూ.35వేలకు చేరింది. అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధం పరిస్థితులు ఉన్నప్పుడు పసిడి ధరలు పెరుగుతూ ఉంటాయి. ప్రస్తుతమైతే అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితులే రేటు పెరగడానికి కారణం. ప్రస్తుతం పరిస్థితిని బట్టి అంచనా వేస్తే బంగారం త్వరలోనే రూ.40వేలకు చేరే అవకాశం ఉంది. " -- మిలన్ షా, బంగారు షాపు యజమాని
ధరలు పెరిగినా తప్పదు...
బంగారం ధరలు పెరిగినా విక్రయించడం తప్పడం లేదని వినియోగదారులు చెబుతున్నారు. అయితే కొనాలనుకున్న దాని కన్నా తక్కువ మొత్తంలో విక్రయిస్తున్నామని చెబుతున్నారు.
"ధరలైతే ఎక్కువగా ఉన్నాయి. కానీ కొనేందుకు వచ్చాం.. కొనక తప్పదు. కాబట్టి కాస్త తక్కువొస్తున్నా కొన్నాం. 150 గ్రాములు కొనాలని వచ్చాం. కానీ ధరల వల్ల 100గ్రాములే తీసుకున్నాం" - ఉపాసనా కుమారి, కొనుగోలుదారు