స్టాక్ మార్కెట్లపై (Stock Markets) ఈ వారం అంతర్జాతీయ పరిణామాల ప్రభావం అధికంగా ఉండొచ్చని (Market Outlook) తెలుస్తోంది. అయితే నెలాఖరు ఈ వారంలోనే ఉండటం, సూచీలు కొత్త గరిష్ఠాల వద్ద కొనసాగుతున్న నేపథ్యంలో కాస్త ఒడుదొడుకులకు అవకాశమున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరో 2-3 ఏళ్లు మార్కెట్ల జోరు..
బీఎస్ఈ-సెన్సెక్స్ గత వారం 60 వేల మార్క్ పైన (Sensex new records) స్థిరపడింది. ఈ-ఏడాది జనవరిలోనే 50 వేల మార్క్‌ను అందుకున్న సెన్సెక్స్ 8 నెలల్లోనే 10 వేల పాయింట్లు ఎగబాకటం విశేషం.
'దేశీయంగా ఉన్న అన్ని అనిశ్చితులను దాటుకుంటూ బుల్ జోరు కొనసాగుతోంది. మార్కెట్లలో 2003-2007 నాటి సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరో 2-3 ఏళ్లు సూచీలు ఈ జోరును కొనసాగించే అవకాశముంది' అని స్వస్థికా ఇన్వెస్ట్మెంట్ పరిశోధన విభాగాధిపతి సంతోశ్ మీనా పేర్కొన్నారు. అయితే రికార్డు స్థాయిల వద్ద స్వల్పకాల ఒడుదొడుకులు ఉంటాయని స్పష్టం చేశారు.
మోతీలాల్ ఓశ్వాల్ ఫినాన్షియల్ సర్వీసెస్ కూడా మార్కెట్లపై సానుకూల అంచనాలనే విడుదల చేసింది. స్వల్ప కాలంలో ఒడుదొడుకులున్నా.. ఆర్థిక పరిస్థితులు మెరుగవ్వటం, కార్పొరేట్ల ఫలితాలపై సానుకూల అంచనాల వంటి కారణాలతో మార్కెట్లు మరింత ముందుకు సాగే అవకాశముందని విశ్లేషించింది. 2021-22 రెండో త్రైమాసిక ఫలితాల ప్రకటనను కార్పొరేట్లు వచ్చే వారం ప్రారంభించనున్నాయి.
వారాంతంలో సెప్టెంబర్ నెలకు సంబంధించి.. వాహన విక్రయాలు, పీఎంఐ వంటి గణాంకాలు విడుదల కానున్న నేపథ్యంలో ఆ ప్రభావం కూడా మార్కెట్లపై అధికంగా ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటన్నింటితో పాటు.. కరోనా కేసులు, వ్యాక్సినేషన్ అప్డేట్స్, ముడి చమురు ధరలు, రూపాయి కదలికలు మార్కెట్లను ప్రభావితం చేసే సాధారణ అంశాలుగా ఉండనున్నాయని చెబుతున్నారు.
ఇదీ చదవండి:ఆహార వ్యర్థాలే ఈ అంకుర సంస్థకు పెట్టుబడి