వడ్డీరేట్లపై యూఎస్ ఫెడ్ తీసుకునే నిర్ణయాలపైనే దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Market) ఆధారపడనున్నాయి. (Stock Market next week outlook) ఈ వారం.. దేశంలో ఆర్థిక గణాంకాలేవీ విడుదలయ్యే అవకాశం లేని నేపథ్యంలో.. ఇతర అంతర్జాతీయ పరిణామాలపై మదుపర్లు దృష్టిసారించనున్నారు.
గత వారం మార్కెట్లు రికార్డు లాభాలను నమోదు చేశాయి. శుక్రవారం సూచీలు సరికొత్త జీవితకాల గరిష్ఠానికి చేరాయి. టెలికాం, బ్యాంకింగ్, ఆటోమొబైల్ రంగాల్లో సంస్కరణలు మార్కెట్ సెంటిమెంట్‌ను సానుకూలంగా మార్చాయి. ఆర్థిక గణాంకాలు మెరుగ్గా ఉండటం సైతం మార్కెట్ల బుల్ రన్‌కు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, ఈ వారం మాత్రం అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు ఉన్నాయని అంటున్నారు. (market outlook for next week)
"ఇటీవల అంచనాలకు మించి రాణించిన నేపథ్యంలో.. ఇండియా మార్కెట్లకు ఈ వారం చాలా కీలకం. అంతర్జాతీయంగా కొన్ని బలహీన సంకేతాలు ఉన్నాయి. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ మీటింగ్ సెప్టెంబర్ 21-22 తేదీల్లో జరగనుంది. ఇది మార్కెట్ గమనాన్ని నిర్దేశించడంలో కీలకం కానుంది. బ్యాంక్ ఆఫ్ జపాన్ సైతం తన ద్రవ్య విధానాన్ని సెప్టెంబర్ 22న విడుదల చేయనుంది. ఇది కూడా మార్కెట్‌పై ప్రభావం చూపేదే."
-సంతోష్ మీనా, స్వస్తికా ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్
డాలర్ ఇండెక్స్, అమెరికా బాండ్లపై వచ్చే రాబడి (US bond yield) సైతం దేశంలో మార్కెట్లను ప్రభావితం చేస్తుందని మీనా తెలిపారు. 'ప్రస్తుతం మన మార్కెట్లలో బుల్ రంకెలేస్తోంది. దీర్ఘకాలంగా చూసుకుంటే.. ఇది 2-3 ఏళ్ల వరకు కొనసాగవచ్చు. కానీ, షార్ట్ టర్మ్‌లో మార్కెట్లు కరెక్షన్కు గురవుతాయి' అని పేర్కొన్నారు.