EPFO stock market investments: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)కు స్టాక్‌మార్కెట్ అండగా నిలుస్తోంది. ఏడాదిన్నరగా మార్కెట్ పెరగడంతో ఆ మేరకు లాభాలు వస్తున్నాయి. ఈపీఎఫ్‌వో సంప్రదాయ పెట్టుబడులతో పాటు ఎక్స్ఛేంజ్ ట్రేడింగ్ ఫండ్స్ (ఈటీఎఫ్) నుంచి వచ్చే ప్రతిఫలంతో వడ్డీని నిర్ణయిస్తోంది. ఇప్పటికే మూడు దఫాలుగా మెరుగైన లాభాలతో ఈటీఎఫ్‌లను విక్రయించింది. 2017లో కొనుగోలు చేసిన ఈటీఎఫ్‌లను ఈ సంవత్సరం విక్రయించడంతో దాదాపు రూ.9వేల కోట్లకు పైగా లాభాలు వచ్చే అవకాశముందని అంచనా వేస్తోంది.
EPFO investments in equity:
ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే మిగిలిన ఈక్విటీలు, బాండ్లపై డివిడెండ్‌లు బ్యాంకు నిల్వలపై వడ్డీలు, అందుబాటులోని మిగులు నిధులు, ఇతర ఖర్చులు అంచనా వేసి 2021-22 ఏడాదికి వడ్డీ రేటు ఖరారు చేయనున్నట్లు సమాచారం. మరోవైపు మార్కెట్‌లో బాండ్ల రూపంలోని పెట్టుబడులపై అనిశ్చితి నెలకొంది. కొన్ని కంపెనీలు దివాలా తీయడంతో వాటి నుంచి నిధులు రాబట్టేందుకు న్యాయపరమైన ప్రయత్నాలు చేస్తోంది.
ఈక్విటీలో 8 శాతమే...
మెరుగైన లాభాల కోసం 5 శాతం ఈపీఎఫ్‌వో నిధులను స్టాక్‌మార్కెట్లో పెట్టాలని 2015లో కేంద్ర కార్మికశాఖ నిర్ణయించింది. ఆ తరువాత ఈ వాటాను 15 శాతానికి పెంచింది. ప్రస్తుతం ఈపీఎఫ్‌వో నిధుల్లో 92శాతం బ్యాంకులు, ఇతర బాండ్ల రూపంలో ఉంటే, 8 శాతం మాత్రమే ఈక్విటీ మార్కెట్లో ఉన్నాయి. నిఫ్టీ, సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతోంది. 2015 నుంచి ఏటా ఈటీఎఫ్‌లు కొని, వాటిని మెరుగైన లాభాలతో విక్రయిస్తోంది.
- 2017-18 ఏడాదిలో వడ్డీ చెల్లింపుల కోసం 2015లో కొనుగోలు చేసిన ఈటీఎఫ్‌లను విక్రయించగా రూ.1,011.82 కోట్ల లాభాలు వచ్చాయి. ఈ నిధులతో కలిపి చందాదారులకు 8.55శాతం వడ్డీ చెల్లించినా, మరో రూ.2,320 కోట్ల మిగులు నిధులున్నాయి.
- 2018-19లో విక్రయించలేదు. ఆ యూనిట్లపై వచ్చిన డివిడెండ్లతో రూ.155 కోట్ల మిగులు తేలడంతో 8.65శాతం చొప్పున వడ్డీ ప్రకటించింది.
- 2016లో కొన్న ఈటీఎఫ్‌లను 2019-20లో విక్రయించాలని భావించినా, మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ప్రతిపాదన విరమించుకుంది.
- 2020 డిసెంబరులో యూనిట్లు విక్రయించగా రూ.3,277.16 కోట్ల లాభం లభించింది. ఈ లాభం కారణంగా 2021 జనవరిలో రూ.954.62కోట్ల మిగులుతో 8.5శాతం చొప్పున వడ్డీ నిర్ణయించింది.
- 2020-21లో 8.5 శాతం వడ్డీ ఖరారు చేసేందుకు 2017 జనవరి 1 నుంచి జూన్‌నెలాఖరు వరకు కొనుగోలు చేసిన యూనిట్లు 2021 మార్చిలోగా విక్రయించాలని నిర్ణయించింది. విక్రయంతో ఈపీఎఫ్‌వోకు రూ.4,072.83 కోట్ల లాభం వచ్చింది. ఇతర ఈటీఎఫ్‌లపై డివిడెండ్ల రూపంలో మరో రూ.3972.01 కోట్లు లభించాయి.
- 2021-22 ఏడాదికి వడ్డీ చెల్లించేందుకు నాలుగోదఫా కింద 2017 జులై 1 నుంచి డిసెంబరు వరకు కొనుగోలు చేసిన ఈక్విటీలను విక్రయించాలని భావిస్తోంది. వీటితో కనీసం రూ.9వేల కోట్ల లాభం వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ యూనిట్ల విక్రయాన్ని ఈ ఏడాది మార్చి 31లోగా పూర్తి చేయనుంది.
ఇదీ చదవండి:'ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందేది భారత ఆర్థిక వ్యవస్థే'