కొన్ని రోజులుగా కరోనా భయాలతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. రోజురోజుకు పతనాల్లో కొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. కరోనా సహా ఆర్థిక మందగమనం భయాలతో గత నెల నుంచే మార్కెట్లు ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నప్పటికీ.. ఫిబ్రవరి 28 నుంచి రికార్డు స్థాయి నష్టాల్లోకి జారుకున్నాయి.
అమెరికా తుమ్మితే ప్రపంచానికి జలుబు చేస్తుందనే మాట ఇప్పుడు మారింది. చైనాకు వైరస్ సోకితే.. ప్రపంచమంతా అల్లకల్లోలం అవుతోంది. కరోనా ప్రభావంతో ఈ రెండు నెలల కాలంలో సెన్సెక్స్ ఏకంగా 7,850 పాయింట్లు కోల్పోయింది. ఇలాంటప్పుడు చిన్న మదుపరులు ఏం చేయాలన్నది ప్రధానంగా తెలుసుకోవాలి..
లక్ష్యం వదిలేయొద్దు..
పెట్టుబడిని ప్రారంభించేప్పుడే దానికో లక్ష్యం నిర్దేశించుకోవాలి. ఇక మన దృష్టంతా దానిపైనే ఉండాలి. ఉదాహరణకు రాబోయే 20 ఏళ్ల వరకూ నెలకు రూ.5,000 మదుపు చేయాలి.. కనీసం 12 శాతం వార్షిక రాబడి రావాలి.. అనే లక్ష్యంతో మార్కెట్లోకి ప్రవేశించారు. ఈ 20 ఏళ్ల కాలంలో సూచీలకు ఎన్నో ఆటుపోట్లు వస్తాయి. వాటన్నింటి గురించీ మనకు అవసరం లేదు. మార్కెట్ ప్రతి దశలోనూ మన పెట్టుబడులు ఉన్నాయా లేదా అనేదే ప్రధానం.
ఎంతోకొంత నష్టభయం లేకుండా పెట్టుబడులు ఉండవు. ఇక్కడ మరో ముఖ్య విషయం.. అనుకున్న లక్ష్యం చేరుకోవడానికి ఎక్కువ వ్యవధి లేదనుకోండి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెట్టుబడులను కొనసాగించడం ఇబ్బందికరమే. మరింత నష్టాలు రాకముందే ఈక్విటీల్లో ఉన్న పెట్టుబడులను కాస్త సురక్షిత పథకాల్లోకి మళ్లించడం మేలు.
మీరు ఇప్పుడిప్పుడే మదుపు ప్రారంభించారనుకుందాం. మార్కెట్ తగ్గుతోంది అంటే కొత్త అవకాశం ఇచ్చినట్లే. వీలైతే క్రమానుగత పెట్టుబడి మొత్తాన్ని పెంచేందుకూ ప్రయత్నించవచ్చు. ఇంకా అనుమానాలున్నాయనుకోండి.. కొత్త పెట్టుబడులకు కాస్త విరామం ఇవ్వండి. మార్కెట్‌పై మరింత స్పష్టత వచ్చాకే మదుపు తిరిగి ప్రారంభించండి. ఆందోళన, అత్యాశ రెండూ మన శత్రువులే. వీటిని కట్టడి చేయాలి. పూర్తి వివరాలు తెలుసుకుని, స్పష్టమైన అవగాహనతో మదుపు కొనసాగించాలి.
నష్టం.. సహజం..
షేర్లు, వీటి ఆధారంగా పనిచేసే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు.. వీటిలో ఎంతో కొంత నష్టభయం సహజమే. ఆ మాటకొస్తే.. ప్రతి పెట్టుబడి పథకంలోనూ ఎంతోకొంత నష్టభయం అంతర్లీనంగా ఉంటుంది. మార్కెట్‌లో ఎప్పుడూ ఆటుపోట్లు వస్తూనే ఉంటాయి. ఇలా వచ్చే ప్రతిదశలోనూ కొత్త పెట్టుబడులకు అవకాశాలుంటాయి. ప్రతిసారీ లాభాలే రావు.. ఎప్పుడూ నష్టపోం.
మార్కెట్, పెట్టుబడులపైన ఆసక్తి ఉన్న మదుపరులు పరిస్థితులతో సంబంధం లేకుండా సరికొత్త అవకాశాలను అందుకుంటూనే ఉంటారు. ఏ విధంగా ఉన్నా కొంతమంది లాభాలు సంపాదిస్తుంటారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో మీరు ఎంత వరకూ నష్టభయం భరించగలరనే విషయాన్ని లెక్కించండి. నష్టం వచ్చినా తట్టుకోగలం అనుకుంటే.. చైనాతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న రంగాల్లో పెట్టుబడి పెట్టండి. పరిస్థితులు సర్దుకున్నాక అవి అధిక రాబడులను అందించే అవకాశం లేకపోలేదు.