దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమైనా.. అమ్మకాల ఒత్తిడితో చివరి సెషన్లో ఒడుదొడుకులకు లోనయ్యాయి. అంతర్జాతీయ ప్రతికూలతల నడుమ మార్కెట్ క్లోజింగ్ సమయానికి స్వల్ప లాభాలతో ముగిశాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 40 పాయింట్ల లాభంతో 39,113 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 10 పెరిగి 11,559 పాయింట్లకు చేరింది.
బ్యాంకింగ్ షేర్ల దన్ను..
లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు.. బ్యాంకింగ్ రంగంలో మరింత వృద్ధి కోసం రాబోయే రోజుల్లో కొత్త విధానాలను రూపొందించుకోవాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటన ప్రోత్సాహమిచ్చింది. బ్యాంకింగ్ షేర్ల దన్నుతో సెన్సెక్స్ ఒకానొక దశలో 39,327 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది.
అయితే ఆగస్టు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టుల గడువు పూర్తి కావటం వల్ల మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. మరోవైపు వార్షిక జాక్సన్ హోల్ సింపోజియంలో అమెరికా ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగంపై మదుపరులు ఆసక్తిగా చూస్తుండటం ప్రతికూల ప్రభావం ఏర్పడింది.
లాభనష్టాల్లో..
ఇండస్ఇండ్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, సన్‌ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, మారుతి, ఎల్ అండ్ టీ, ఐసీఐసీఐ బ్యాంక్ లాభపడ్డాయి.