దశాబ్దకాలం క్రితం పొరుగుదేశమైన చైనా మార్కెట్ విలువ (మార్కెట్ కేపిటలైజేషన్) మన దేశంతో పోల్చిచూసినప్పుడు ఎంతో వెనుక కనిపించేది. కొన్నేళ్లలో పరిస్థితి మారిపోయింది. ఆ దేశం మార్కెట్ క్యాప్ విషయంలో దూసుకుపోతోంది. మనం మాత్రం వెనుకబడిపోయాం. తత్ఫలితంగా విదేశీ పెట్టుబడులను చైనా స్థాయిలో మనం ఆకర్షించలేని పరిస్థితి ఏర్పడుతోంది. 2006లో మనదేశ మార్కెట్ క్యాప్ 74,500 కోట్ల డాలర్లు కాగా, ఆ సమయంలో చైనాది 40,700 కోట్ల డాలర్లు మాత్రమే. ప్రస్తుతం చైనా మార్కెట్ క్యాప్ 10 లక్షల కోట్ల డాలర్లు అయితే మనది 2.11 లక్షల కోట్ల డాలర్లు మాత్రమే. చైనా మనల్ని ఎలా మించిపోగలిగింది, మనం ఎక్కడ వెనుకబడిపోయాం... అనే అంశాలను ‘ఈనాడు’ ఇంటర్వ్యూలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ స్ట్రాటజీ హెడ్ వినోద్ కర్కి వివరించారు. ఆ విశేషాలు..
ఇటీవల చైనా 'మార్కెట్ క్యాప్' ఎంతో వేగంగా పెరుగుతోంది. దీనికేమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా?
జవాబు: చైనా ఆర్థిక వ్యవస్థ గత కొన్నేళ్లలో ఎంతో పెద్దదైంది. అదే స్థాయిలో చైనా మార్కెట్ విలువ పెరగలేదు. అందుకు కారణం అక్కడి ఎన్నో పెద్ద కంపెనీలు స్టాక్‌మార్కెట్లో నమోదు కాకపోవటమే. గత దశాబ్దకాలంలో చైనాలో అలీబాబా, టెన్సెంట్ వంటి టెక్నాలజీ కంపెనీలు, ఐసీబీసీ వంటి ఆర్థిక సంస్థలు ప్రపంచ స్థాయి కంపెనీలుగా ఎదిగాయి. ఇటువంటి కంపెనీల్లో కొన్ని ఇటీవల స్టాక్‌మార్కెట్‌కు వస్తున్నాయి. అందువల్ల చైనా మార్కెట్ కేపిటలైజేషన్ పెరుగుతూ వస్తోంది. దాంతో పాటే చైనా మార్కెట్ క్యాప్-టు-జీడీపీ (జీడీపీలో మార్కెట్ కేపిటలైజేషన్ శాతం) కూడా పెరుగుతూ ప్రపంచ దేశాల సగటుకు దగ్గరవుతోంది.
ప్రస్తుతం చైనా మార్కెట్ క్యాప్- టు- జీడీపీ 50 శాతంగా ఉంది. కానీ ప్రపంచ సగటు మాత్రం 80 శాతం కాగా, మన దేశంలో విషయంలో ఇది 77 శాతం ఉంది. దీని ప్రకారం చూస్తే, చైనా మార్కెట్ క్యాప్-టు-జీడీపీ ఇంకా పెరిగే అవకాశమే కనిపిస్తోంది. దీని వల్ల మనదేశంపై ఎటువంటి ప్రభావం ఉంటుంది?
చైనా మార్కెట్ క్యాప్-టు- జీడీపీ పెరగటం వల్ల ఎంఎస్‌సీఐ సూచీల్లో చైనా ఈక్విటీల వెయిటేజీ పెరుగుతుంది. తత్ఫలితంగా చైనా ఈక్విటీల్లోకి పెట్టుబడులు ప్రవాహం పెరగవచ్చు. కానీ మార్కెట్ క్యాప్-టు-జీడీపీ అనేది అంచనా విలువ మాత్రమే. దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలు, రిటర్న్ ఆన్ ఈక్విటీ (ఆర్‌ఓఈ) మాత్రమే చైనా కంపెనీల విలువలను నిర్ధారిస్తాయి. ఇటీవల కాలంలో పలు దేశాలు చైనా కంపెనీలపై ఆంక్షలు విధిస్తున్నాయి. టెలికామ్, ఇంటర్నెట్ ఉపకరణాలు చైనా నుంచి కొనుగోలు చేయటానికి ఇష్టపడటం లేదు. దీనివల్ల చైనా కంపెనీల మార్కెట్ విలువ తగ్గి మార్కెట్ కేపిటలైజేషన్ దిగిరావచ్చు. అదే సమయంలో చైనా ఆర్థిక వ్యవస్థ 'ప్రపంచ తయారీ కేంద్రం' నుంచి, అంతర్గత వినియోగ మార్కెట్‌గా మారుతోంది. దీనివల్ల సేవలు, వినియోగ రంగాల్లో చైనా కంపెనీలు ఎదిగే అవకాశం ఉంటుంది.
మూలధనాన్ని సమీకరించటం భారతీయ కంపెనీలకు ఎంతో కష్టంగా ఉంటుంది. అదే సమయంలో చైనా కంపెనీలకు ప్రభుత్వం ఎంత కావాలనుకుంటే అంత మూలధనాన్ని అందిస్తోంది. దీనివల్ల చైనా కంపెనీలు వేగంగా విస్తరించే అవకాశం కలుగుతోంది. దీన్ని అధిగమించడం ఎలా?
చైనాలో ప్రభుత్వ విధానాలు వృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఉంటున్నాయి. స్థానిక కంపెనీల ప్రయోజనాలను కాపాడటానికి చైనా ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుంది. కానీ ఇటీవల కాలంలో మనదేశంలోనూ మార్పులు వస్తున్నాయి. సులభతర వ్యాపార విధానాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్, ఇంధన రంగాల్లో వేగవంతమైన వృద్ధి సాధించిన ఘనత మనకు ఉంది. అంతేగాక ప్రజాస్వామ్య వ్యవస్థ వల్ల స్థిరమైన వృద్ధి సాధనకు, స్వేచ్ఛగా ఎదిగేందుకు మనదేశంలో అవకాశాలు ఉన్నాయి.