దలాల్ స్ట్రీట్లో నేడు 'బేర్' మారణహోమం సృష్టించింది. సెన్సెక్స్, నిఫ్టీ ప్రారంభించినప్పటి నుంచి రికార్డు స్థాయి ఒక్కరోజు పతనాలు నమోదు చేశాయి. దేశీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలో ఈ రోజు బ్లాక్ మండేగా మిగిలిపోనుంది.
బేర్ ధాటికి సెన్సెక్స్ 1942 పాయింట్లు పతనమై 35,635 పాయింట్లకు చేరింది. నిఫ్టీ 538 పాయింట్లు క్షీణించి 10,451 పాయింట్లకు పడిపోయింది. సెన్సెక్, నిఫ్టీ సూచీలు ఒక్కరోజులో భారీ పతనాలను నమోదు చేశాయి.
7 లక్షల కోట్లు ఆవిరి
వరుసగా రెండోరోజు మదుపరులు భారీగా నష్టపోయారు. రికార్డు స్థాయిలో స్టాక్ మార్కెట్లు పతనమైన కారణంగా మదుపరులు రూ.7 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు.
అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే ఉన్నాయి. ఓఎన్జీసీ, రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, టీసీఎస్, టాటాస్టీల్, ఎల్ అండ్ టీ భారీ నష్టాల్లో ఉన్నాయి. ఎస్బీఐ 49 శాతం వాటా కొనుగోలు ప్రకటనతో ఎస్ బ్యాంకు షేర్లు 31 శాతం పెరిగాయి.