తెలంగాణ

telangana

ETV Bharat / business

మాంద్యానికి 'సీతమ్మ మందు'తో లాభాలివే!

వృద్ధి వేగం మందగించిందన్న వార్తల నేపథ్యంలో ఉద్దీపన చర్యలు చేపట్టారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​. సర్​ఛార్జీల ఉపసంహరణ, అధిక పన్నుల తగ్గింపు చర్యలు చేపట్టారు. విదేశీ పెట్టుబడులకు, అంకుర సంస్థలకు ప్రోత్సాహం అందిస్తూ పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఉద్దీపన చర్యలతో సమాన్యుడికి కలిగే లాభాలివే...

మాంద్యానికి ... సీతమ్మ మందు

By

Published : Aug 24, 2019, 9:59 AM IST

Updated : Sep 28, 2019, 2:07 AM IST

ఆర్థిక వ్యవస్థ మందగిస్తోన్న వేళ.. వృద్ధి వేగం పెంచే దిశగా నిర్ణయం తీసుకున్నారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులపై విధించిన సర్​ఛార్జీల ఉపసంహరణ మొదలు అంకుర సంస్థలకు ఏంజెల్ పన్ను ఉపసంహరణ వరకు ఆమె పలు తాయిలాలు ప్రకటించారు. ప్రభుత్వ ఉద్దీపన చర్యలను కార్పొరేట్​, పారిశ్రామిక వర్గాలు స్వాగతించాయి.

స్టాక్​ మార్కెట్ల కోసం ఉద్దీపనలు ... లాభాలు

  • శ్రీమంతులు, విదేశీ మదుపర్ల దీర్ఘకాలిక, స్వల్పకాలిక మూలధన లాభాలపై అదనంగా విధించిన సర్​ఛార్జీల ఉపసంహరణ. దీని వల్ల ప్రభుత్వానికి రూ.1400 కోట్ల మేర ఆదాయం కోతపడుతుంది. కానీ సెంటిమెంట్​ మెరుగవుతుంది. ఎఫ్​పీఐల పన్ను రేటు 7 నుంచి 4 శాతానికి చేరనున్నాయి.
  • నమోదిత అంకురాలకు ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 56-2బి ఇకపై వర్తించదు. ఫలితంగా వారు ఏంజెల్ పన్నును కట్టనక్కర్లేదు. ఫలితంగా అంకురాలు... ప్రారంభ దశలో మూలధనాన్ని సమీకరించుకోవడానికి వీలవుతుంది.
  • ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.7 వేల కోట్ల అదనపు మూలధన నిధులు విడుదల. ఫలితంగా రూ.5 లక్షల కోట్లకు పెరగనున్న బ్యాంకుల రుణసామర్థ్యం.
  • మౌలిక, గృహ ప్రాజెక్టులకు రుణాలు అందేలా ప్రోత్సాహం. ఫలితంగా నిధుల లభ్యత పెరుగుతుంది. ఆ రంగాల్లో ఉపాధి అవకాశాలూ మెరుగవుతాయి.

పన్ను విషయంలో...

  • విజయ దశమి నుంచి వ్యక్తిగత హాజరులేని (ఫేస్​లెస్) పన్ను తనిఖీ ఉంటుంది.
  • ఆదాయపన్ను రిటర్నుల్లో ముందస్తుగా సమాచారాన్ని నింపే విధానం త్వరలో అమలు.
  • జీఎస్​టీ రిటర్నుల సంఖ్య తగ్గింపు, త్వరలో ఆచరణలోకి సరళీకృత దరఖాస్తులు అందుబాటులోకి వస్తాయి. రిఫండ్ ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఫలితంగా ఐటీ రిటర్నలు మరింత సులభతరమవుతాయి.
  • కార్పొరేటు నేరాల విషయంలో 1400కు పైగా కేసులు వెనక్కి తీసుకుంటారు. ఫలితంగా ఆయా వర్గాలకు ఊరట లభిస్తుంది.

వినియోగాన్ని పెంచేందుకు...

వినియోగదార్ల కోసం ఆధార్​ ఆధారిత కేవైసీని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్​బీఎఫ్​సీ) ఉపయోగించుకోవచ్చు. వాహనాలు, గృహ, వినియోగదారు వస్తువులు కొనగోలుచేసేవారికి మరింత రుణ మద్దతు లభిస్తుంది. గృహరుణ సంస్థలకు అదనంగా రూ.20 వేల కోట్ల ద్రవ్యలభ్యత కలుగనుంది. ఫలితంగా స్థిరాస్తి రంగానికి ఊతం లభిస్తుంది.

'ఎమ్​ఎస్​ఎమ్​ఈ'ల కోసం...

సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీలకు రావాల్సిన అన్ని జీఎస్​టీ రిఫండ్​లను 30 రోజుల్లో పరిష్కరిస్తారు. అలాగే ఎమ్​ఎస్​ఎమ్​ఈల కోసం ఒన్​ టైం సెటిల్​మెంట్​ పథకాలను బ్యాంకులు జారీ చేయనున్నాయి. ఫలితంగా ఈ రంగానికి ఉద్దీపన కలుగుతుంది. ఉద్యోగ అవకాశాలూ పెరుగుతాయి.

వాహనరంగం...

ప్రభుత్వ తాజా నిర్ణయాలతో వాహనరంగానికి భారీ ఊరట కలుగనుంది.

  • మార్చి 31, 2020 వరకు కొనుగోలు చేసే బీఎస్‌-4 వాహనాలను రిజిస్ట్రేషన్‌ గడువు మొత్తం వరకు కొనసాగించవచ్చు.
  • ఒకేసారి కట్టే రిజిస్ట్రేషన్‌ ఫీజు సవరింపును జూన్‌ 2020 వరకు వాయిదా వేశారు.
  • విక్రయాలు లేక నిల్వలు పేరుకుపోవడంతో.. మార్చి 2020 వరకు కొనుగోలు చేసే ఏ వాహనానికైనా అదనంగా 15 శాతం తరుగుదలకు అనుమతి ఇచ్చారు. దీంతో మొత్తం మీద ఇది 30 శాతానికి చేరింది.
  • విద్యుత్‌ వాహనాలు (ఈవీ), ఇంటర్నల్‌ కంబషన్‌ వాహనాల(ఐసీవీ) రిజిస్ట్రేషన్‌ కొనసాగుతుంది.
  • ప్రభుత్వ శాఖలు, విభాగాలు తమ పాత వాహనాల స్థానంలో కొత్త వాహనాలను కొనుగోలు చేయడంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేశారు. తద్వారా గిరాకీ పెరగడానికి ఊతమిచ్చారు.
  • గిరాకీని మరింత పెంచడం కోసం తుక్కు విధానం(స్క్రాప్‌ పాలసీ)తో పాటు పలు చర్యలను ప్రభుత్వం పరిశీలించనుంది.
  • విడిభాగాల అభివృద్ధికి తగిన మౌలిక వసతుల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించనుంది.

బ్యాంకులకు..

  • ఎమ్‌సీఎల్‌ఆర్‌ రేటు కోతలన్నిటిని పూర్తిస్థాయిలో వినియోగదార్లకు బ్యాంకులు బదిలీ చేస్తాయి.
  • రెపో అనుసంధానిత రుణ పథకాలను బ్యాంకులు ప్రకటిస్తాయి.
  • రుణాల సెటిల్‌మెంట్‌ కోసం మెరుగైన, పారదర్శక ప్రక్రియలను బ్యాంకులు ప్రవేశపెట్టనున్నాయి.
  • ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు సైతం ఒకే సారి చేసుకునే రుణ సెటిల్‌మెంట్‌ కోసం చెక్‌బుక్‌ విధానాన్ని బ్యాంకులు తీసుకురానున్నాయి.
  • మూలధన రుణాలు మరింత చౌక కానున్నాయి.
  • బ్యాంకులకు ఎదురయ్యే నష్టభయ సమస్యలకు ఒక పరిష్కారం చూపుతారు.
  • రుణాన్ని తీర్చిన అనంతరం 15 రోజుల్లోనే రుణ పత్రాలను వెనక్కి ఇచ్చేలా ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఆదేశాలు జారీ చేస్తారు. (దీని వల్ల తనఖా ఆస్తులున్న రుణ స్వీకర్తలకు ప్రయోజనం కలుగుతుంది.)

లాభమేమంటే...

పై ఉద్దీపన చర్యల వల్ల రుణ స్వీకర్తలకు ప్రయోజనాలు అందుతాయి. రెపో రేటును అనుసంధానించడం వల్ల గృహ, వ్యక్తిగత రుణాలకు సంబంధించిన ఈఎమ్​ఐలు తగ్గుతాయి. పరిశ్రమలకు సైతం నిర్వహణ మూలధన రుణాలు చౌకగా లభిస్తాయి. బ్యాంకులకు రూ.70,000 కోట్లను ఒకేసారి విడుదల చేయడం వల్ల కార్పొరేట్లు, రిటైల్‌ రుణ స్వీకర్తలు, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు, చిన్న వర్తకులకు కూడా ప్రయోజనాలు కలుగుతాయి.

ఇదీ చూడండి: ఆర్థిక స్వేచ్ఛకు గాంధీ చెప్పిన సిద్ధాంతాలు ఇవే

Last Updated : Sep 28, 2019, 2:07 AM IST

ABOUT THE AUTHOR

...view details