మన దేశంలో స్టాక్ మార్కెట్లలోకి(Stock Market) వచ్చే రిటైల్ మదుపర్ల సంఖ్య చాలా తక్కువ. ప్రపంచంలోనే అత్యంత కనిష్ఠమని చెప్పాలి. చాలా మంది చిన్న మదుపర్లు షేర్లలోకి దిగకుండా.. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టడానికే మొగ్గు చూపిస్తారు. షేర్లతో కూడిన పోర్ట్‌ఫోలియోలను నిర్మించుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. దానికి కారణం నష్టభయమే. తక్కువ నష్టభయంతో ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టి మంచి ప్రతిఫలాలు అంటే స్థిరమైన ప్రతిఫలాలను పొందడం అన్నది ఒక కళ. అది నేర్చుకోవడానికి ఈ ఆరు సూత్రాలు పాటిస్తే సరి.
1. షేర్లు ఎపుడూ కొనొద్దు..
వినడానికి విచిత్రంగా ఉందా? పెట్టుబడుల నియమాల్లో ఇది అతి ప్రాథమిక సూత్రం. ఏదైనా షేరును కొనుగోలు చేయడం కంటే ఆ వ్యాపారంలో భాగస్వామిగా వ్యవహరించాలి. అర్థం కాలేదా? ఇది చాలా సరళమైన అంశమే. ఎలాగంటే.. మనం ఏవైనా షేర్లను కొనుగోలు చేయడానికీ.. ఆ కంపెనీలో భాగస్వామిగా చేరామని అనుకుని షేర్లను తీసుకోవడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ముందుగా మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. సదరు కంపెనీ మేనేజ్మెంట్ బాగుందా? ఆ కంపెనీ ఉన్న రంగానికి వృద్ధి అంచనాలు ఎలా ఉన్నాయి? ఆ కంపెనీ పరిశ్రమలో నాయకత్వ స్థానంలో ఉందా? ఆ స్థానం స్థిరంగా కొనసాగగలదా? కార్పొరేట్ పాలన ఎలా ఉంది? బ్యాలెన్స్ షీట్లు ఎలా ఉన్నాయి? ఇలా లోతుగా వెళ్లి మనదైన కసరత్తు చేయాలి.
2. 'నాణ్యత'లో పెట్టుబడి పెట్టండి
ఎపుడూ నాణ్యత విషయంలో రాజీ పడకూడదు. నాణ్యత అంటే ఇక్కడ మనం షేర్లు కొనుగోలు చేసే కంపెనీని ఒక పోటీతత్వం ఉన్న యాజమాన్యం నడుపుతోందా లేదా చూసుకోవాలి. కొన్నేళ్లుగా దాని ట్రాక్ రికార్డు ఎలా ఉందో చూడాలి. కార్పొరేట్ పాలన విషయంలో అత్యున్నత ప్రమాణాలను పాటించి ఉండాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. 'మెరుగ్గా.. స్వచ్ఛంగా' ఉండి ఉండాలి. ఇటువంటి ఒక కంపెనీని గుర్తించడం చెప్పడం సులభమే కానీ గుర్తించడమే కష్టం. ఎందుకంటే ఈ పరీక్షల్లో నిలబడే కంపెనీలు చాలా తక్కువగానే ఉంటాయి. అయితే ఈ సూత్రాల్ని ఎపుడూ పాటించాలి. అప్పుడే ప్రతిఫలాల్లో స్థిరత్వం కనిపిస్తుంటుంది.
3. దీర్ఘకాలానికి పెట్టుబడులు
ఈక్విటీల్లో డబ్బులు సంపాదించాలంటే దీర్ఘకాలం పాటు పెట్టుబడులు పెట్టాల్సిందే. ఈక్విటీ మార్కెట్లలోని ప్రయోజనాలను పూర్తిగా మనం దక్కించుకోవాలంటే ఎక్కువ కాలం పాటు వేచిచూడడం తప్ప మరో మార్గం లేదు. ఏదైనా కంపెనీతో మనం భాగస్వామ్యం కుదుర్చుకున్నామంటే.. అది దీర్ఘకాలం పాటు అని ముందే గుర్తుపెట్టుకోవాలి. అపుడపుడూ అనూహ్యంగా స్వల్పకాల లాభాలు మనల్ని ఊరిస్తాయి. అయితే మన దృష్టి మరలకూడదు. క్రమశిక్షణను తప్పకూడదు.