టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం(WPI inflation) జూన్లో జీవితకాల గరిష్ఠ స్థాయి నుంచి కాస్త దిగొచ్చింది. డబ్ల్యూపీఐ గత నెల 12.07 శాతంగా నమోదైనట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. మే నెలలో టోకు ద్రవ్యోల్బణం 12.94 శాతంగా ఉంది. 2020 జూన్లో డబ్ల్యూపీఐ 1.81 శాతంగా నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.
WPI inflation: తగ్గిన టోకు ద్రవ్యోల్బణం.. కానీ! - టోకు ద్రవ్యోల్బణం పెరిగేందుకు కారణాలు
వరుసగా మూడో నెలలోనూ (జూన్లో) టోకు ద్రవ్యోల్బణం(India Wholesale Price Index) రెండంకెల వృద్ధిని నమోదు చేసింది. అయితే మే నెలతో పోలిస్తే.. టోకు ద్రవ్యోల్బణం రికార్డు స్థాయి నుంచి కాస్త వెనక్కి తగ్గినట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
జూన్ టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు
ముడి చమురు, ఆహార ఉత్పత్తుల ధరలు కాస్త తగ్గటం వల్ల టోకు ద్రవ్యోల్బణం దిగొచ్చినట్లు పేర్కొంది వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ. అయినప్పటికీ వరుసగా మూడో నెలలోనూ డబ్లూపీఐ సూచీ రెండంకెల వృద్ధిని నమోదు చేయడం గమనార్హం.
- ఇంధన, విద్యుత్ ద్రవ్యోల్బణం జూన్ నెలలో (మేతో పోలిస్తే) 37.61 శాతం నుంచి 32.83 శాతానికి తగ్గింది.
- ఆహార పదార్థాల ద్రవ్యోబ్బణం మేలో 4.31 శాతంగా నమోదవగా.. జూన్లో 3.09 శాతానికి దిగొచ్చింది.
- తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం మాత్రం జూన్లో 10.88 శాతానికి పెరిగింది. మేలో ఇది 10.83 శాతంగా ఉంది.
ఇదీ చదవండి:భారత్‌కు మళ్లీ 'బీబీబీ' రేటింగే